ఇంతకుముందు వైరముత్తు పేరెత్తితే తమిళులు అంత గొప్ప కవి, గేయ రచయిత తమ వాడని గర్వపడేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. ‘మీ టూ’ మూమెంట్ మొదలయ్యాక గాయని చిన్మయి, తదితరులు వైరముత్తు మీద చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయింది. వైరముత్తు మీద కేసులేమీ నమోదు కాలేదు. ఆయనపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అయినా సరే.. జనాల దృష్టిలో ఆయన బాగానే చెడు అయ్యారు.
ఒకరో ఇద్దరో అయితే ఓకే కానీ.. రెండంకెల సంఖ్యలో అమ్మాయిలు ఆయనపై ఆరోపణలు చేశారు. చిన్మయి తన వాదనల్ని చాలా బలంగానే వినిపించింది.ప్రతి దానికీ సాక్ష్యాలు తెచ్చి చూపించలేదు కానీ.. తను చెప్పిన ఉదంతాల గురించి వింటుంటే వైరముత్తులో జనాలకు తెలియని కోణం ఉందనే అనిపించింది చాలామందికి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు వైరముత్తు చేసిన చేపట్టిన ఒక ప్రాజెక్టు విమర్శల పాలవుతోంది. ‘నాట్పదు తెరల్’ పేరుతో వంద పాటల ప్రాజెక్టులో వైరముత్తు భాగమయ్యారు. ఇందులో భాగంగా ఆయన వంద ప్రేమ గీతాలు రాస్తారు. ప్రతి పాటలోనూ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ నేపథ్యంలో వీడియో సాంగ్ రూపొందించి రిలీజ్ చేస్తారు. ఈ క్రమంలో ముందుగా ‘ఎన్ కాదలా’ పేరుతో ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఎన్నై అరిందాల్, విశ్వాసం సినిమాల్లో బాలనటిగా ఆకట్టుకున్న టీనేజ్ అమ్మాయి అనైక మీద ఈ పాట తీశారు.
తనతో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ వయసున్న ఓ నడి వయస్కుడిని చూసి పదహారేళ్ల అమ్మాయి ఆకర్షితురాలై ప్రేమలో పడే కాన్సెప్ట్‌తో ఈ పాట రూపొందడం గమనార్హం. ప్రేమకు వయసు అడ్డు కాదనే వాక్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆమె ప్రేమించేది ఓ కవిని కావడంతో జనాలు వైరముత్తు వ్యక్తిగత జీవితంతో రిలేట్ చేసుకుంటున్నారు. తనతో పోలిస్తే వయసులో చాలా చిన్న వాళ్లయిన అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొన్న వైరముత్తు.. తన ఆలోచనలను పరోక్షంగా ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడని, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాక ఆయనకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో అని నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఆయన తీరును దుయ్యబడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates