మ‌హేష్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్


మే 31వ తేదీని చాలా ప్ర‌త్యేకంగా భావిస్తాడు మ‌హేష్ బాబు. ఎందుకంటే అది అత‌డి తండ్రి, సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. తాను హీరో అయిన ద‌గ్గ‌ర్నుంచి తండ్రి పుట్టిన రోజు నాడు త‌న సినిమాల‌కు సంబంధించి ఏదో ఒక కానుక ఇవ్వ‌డం మ‌హేష్‌కు అల‌వాటు. గ‌త ఏడాది మ‌హేష్‌ కొత్త చిత్రం స‌ర్కారు వారి పాట అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్రి లుక్ రిలీజ్, టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

ఐతే క‌రోనా కార‌ణంగా ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రిగింది. ఈ ఏడాది కృష్ణ పుట్టిన రోజుకు క‌నీసం టీజ‌ర్ అయినా వ‌ద‌లాల‌ని అనుకుంది చిత్ర బృందం. గ‌త నెల‌లోనే ఈ దిశ‌గా నిర్ణ‌యం జ‌రిగింది. కంటెంట్ కూడా రెడీ చేసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. కానీ మేలో క‌రోనా ఉద్ధృతి బాగా పెరిగిపోవ‌డం.. వైర‌స్ ప్ర‌భావం కొంచెం త‌గ్గిన‌ప్ప‌టికీ ప‌రిస్థితులు ఆశాజ‌న‌కంగా ఏమీ లేక‌పోవ‌డంతో చిత్ర బృందం ఆలోచ‌న మార్చుకుంది.

ఈ నెల 31న స‌ర్కారు వారి పాట టీం నుంచి ఎలాంటి కానుకలూ ఉండ‌బోవ‌ని తేలిపోయింది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌ర్కారు వారి పాట గురించి అప్ డేట్స్ ఇవ్వ‌డం స‌రి కాద‌ని చిత్ర బృందం నిర్ణ‌యించింద‌ని.. కాబ‌ట్టి మే 31న ఏ కానుకలూ ఉండ‌వ‌ని, దీని గురించి వ‌చ్చే అస‌త్య‌పు వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని ఈ స్టేట్మెంట్‌లో పేర్కొన్నారు. ఏదైనా స‌మాచారం ఉంటే అధికారిక సోష‌ల్ మీడియా అకౌంట్ల నుంచే పంచుకుంటామ‌ని చిత్ర బృందం పేర్కొంది.

ఈ ప్ర‌క‌ట‌న మ‌హేష్ అభిమానుల‌ను నిరాశ‌కు గురి చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌ప్ప‌దు. కొన్ని వారాల కింద‌టే స‌ర్కారు వారి పాట షూటింగ్ ఆపేయ‌గా.. అప్ప‌ట్నుంచి మ‌హేష్ ఇంటికే ప‌రిమితం అయ్యాడు. ఈ చిత్రం వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల కావాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే. కాగా మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కొత్త సినిమా నుంచి కూడా 31న ఏ అప్‌డేట్స్ ఉండ‌క‌పోవ‌చ్చ‌నే భావిస్తున్నారు.