దిగ్గజ నటుడిపై అసత్య ప్రచారం

రెండు రోజుల కిందటే 80వ పుట్టిన రోజును జరుపుకున్నాడు టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్. ఈ సందర్భంగా ఉత్సాహంగా మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తాను నటనకు గుడ్‌బై చెప్పేస్తున్నట్లు కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం తెలిసిందే. ఈ న్యూస్ వైరల్ అయింది కూడా. ఐతే మంగళవారం ఉదయం ఆయన గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం మొదలైంది.

చంద్రమోహన్ అనారోగ్యం పాలయ్యారని.. ఆయన పరిస్థితి విషమించిందని కొందరు.. ఏకంగా చంద్రమోహన్ చనిపోయారని మరికొందరు ప్రచారాలు సాగించారు. ఈ న్యూస్ కాసేపట్లోనే వైరల్ అయింది. ఐతే దీని గురించి చంద్రమోహన్‌కు సమాచారం అందడంతో ఆయనే స్వయంగా ఒక సీనియర్ పీఆర్వోను సంప్రదించారు. తాను ఇంట్లో క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.

వీడియో కాల్ ద్వారా మాట్లాడి తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. తన గురించి జరుగుతున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేశారు. అంతే కాక ఇంట్లో భార్యతో కలిసి ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ సమాచారం మిగతా పీఆర్వోలకు కూడా పంచుకోవడంతో అందరూ చంద్రమోహన్ గురించి జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ పోస్టులు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో ఇలా వయసు మీద పడ్డ సీనియర్ ఆర్టిస్టులను చంపేయడం ఇది కొత్త కాదు.

ఈ మధ్యే బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ గురించి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఆయన దీనిపై వ్యంగ్యంగా స్పందించారు. రెండు రోజుల ముందు ఉత్సాహంగా మీడియాతో మాట్లాడిన చంద్రమోహన్ వార్తల్లో నిలవడంతో ఆయన గురించి ఇలాంటి ప్రచారం చేస్తే న్యూస్ వైరల్ అవుతుందనుకున్నారో ఏమో. ఇదిలా ఉంటే.. ఆరోగ్యం సహకరించకపోవడం, కరోనా ముప్పు కూడా ఉండటంతో ఇకపై తాను నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చంద్రమోహన్ వెల్లడించడం తెలిసిందే.