ఆహాలో అవ‌త‌రించిన ఓ స్టార్

మ‌ల‌యాళంలో స్టార్లెవ‌రు అని మ‌న ప్రేక్ష‌కుల‌ను అడిగితే మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టి, పృథ్వీరాజ్ లాంటి హీరోల పేర్లు చెప్పేవాళ్లు ఒక‌ప్పుడు. కానీ గ‌త కొన్నేళ్ల‌లో ఓటీటీల పుణ్య‌మా అని అక్క‌డి హీరోలంద‌రి గురించి బాగానే తెలుస్తోంది. ఓటీటీల్లో దేశ‌వ్యాప్తంగా ఇత‌ర భాష‌ల‌ ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆద‌రిస్తున్న‌ది మ‌ల‌యాళ సినిమాలే అంటే అతిశ‌యోక్తి కాదు. అక్క‌డి సినిమాల స‌త్తా ఏంటో ఇప్పుడు అంద‌రికీ బాగా అర్థ‌మ‌వుతోంది.

ముఖ్యంగా తెలుగులో ఒక ఓటీటీ కార‌ణంగా మ‌ల‌యాళ సినిమాల‌కు మంచి పాపులారిటీ వ‌చ్చింది. అది ఆహానే అన్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. బ‌డ్జెట్ మ‌రీ ఎక్కువ పెట్ట‌క‌పోవ‌డం వ‌ల్లో ఏమో.. భారీ చిత్రాల జోలికి వెళ్ల‌కుండా, ఎక్కువ‌గా తెలుగులో చిన్న చిత్రాల‌కు తోడు.. మ‌ల‌యాళ సినిమాల‌ను తెలుగులో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేయ‌డం ఆహాలో ఒక ఒర‌వ‌డిగా మారింది.


ముఖ్యంగా మ‌ల‌యాళ సినిమాల్లోనూ టొవినో థామ‌స్ సినిమాల మీద ఆహా ప్ర‌త్యేకంగా దృష్టిసారించింది. ఫోరెన్సిక్, వ్యూహం, అండ్ ద ఆస్కార్ గోస్ టు.. ఇలా టొవినో న‌టించిన చాలా సినిమాల‌ను ఆహా డ‌బ్ చేసి రిలీజ్ చేసింది. మ‌ల‌యాళంలో టొవినో అనే న‌టుడున్నాడ‌ని చాలామంది తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసిందే ఆహా వ‌ల్ల అంటే అతిశ‌యోక్తి కాదు. ఒక ర‌కంగా ఆహా స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు టొవినో ఒక స్టార్ లాగా అనుకోవ‌చ్చు. దీని మీద సోష‌ల్ మీడియాలో చాలామంది కామెడీ కూడా చేస్తుంటారు. ఆహా టొవినో థామ‌స్ ఫ్యాన్స్ అసోసియేష‌న్ అంటూ జోకులేస్తుంటారు.

టొవినో కొత్త సినిమా రిలీజైతే దాన్ని ప‌ట్టుకొచ్చి తెలుగు డ‌బ్బింగ్‌తో స్ట్రీమ్ చేసేస్తున్న ఆహా.. కొన్ని రోజుల కింద‌టే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన అత‌డి కొత్త చిత్రం కాలాను కూడా లాక్ చేసేసింది. జూన్ 4న ఈ చిత్రానికి ప్రిమియ‌ర్స్ ప‌డ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.