నటనకు గుడ్ బై చెప్పేసిన లెజెండ్

తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో చంద్రమోహన్ ఒకరు. హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా అసాధారణ ప్రయాణం ఆయనది. ఏకంగా 55 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ కెరీర్లో 932 సినిమాలు చేశారు. ఆదివారంతో ఆయనకు 80 ఏళ్లు పూర్తయి.. 81వ వసంతంలోకి అడుగు పెడుతుండటం విశేషం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇకపై తాను సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పేశారు. అనారోగ్యం, కొవిడ్ కారణంగా తాను నటనకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గత కొన్నేళ్లలో తాను గత కొన్నేళ్లలో ఎలా ఇబ్బంది పడిందీ ఆయన ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేయడానికి కారణమేంటి అని చంద్రమోహన్‌ను అడిగితే.. ‘‘ఇందుకు ముఖ్య కారణం.. నా ఆరోగ్యం. దాదాపు 50 సంవత్సరాలు నిర్విరామంగా పని చేసి, నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశా. ఆరోగ్యం విషయంలో ఎవరైనా హెచ్చరించినా… ఇనుముకు చెదలు పడుతుందా అంటూ వెటకారం చేసేవాడిని. కానీ, నా నిర్లక్ష్యమే నన్ను దెబ్బ తీసింది. నా వల్ల షూటింగ్స్ ఆగి నా నిర్మాతలు ఇబ్బందిలో పడటం నాకు ఇష్టం లేక కొన్నిసార్లు అవసరానికి మించి రిస్క్ చేశాను. ‘రాఖీ’ సినిమాలో ఎమోషనల్ సీన్ చేసిన తర్వాత… బైపాస్ సర్జరీ కోసం నేరుగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అలాగే, ‘దువ్వాడ జగన్నాథం’ షూటింగ్ సైతం నా అనారోగ్యం వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు.

తాను ఇకపై సినిమాల్లో నటించకపోయినా.. ఎప్పుడూ ప్రేక్షకులకు తనను గుర్తు చేసేలా సినిమాలు ఎక్కడోచోట వస్తూనే ఉంటాయని చంద్రమోహన్ అన్నారు. ‘‘ప్రతిరోజూ టీవీలో తన సినిమా ఏదో ఒకటి వస్తోంది. యూట్యూబ్ ద్వారా చాలా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. నా అభిమానులు, ప్రేక్షకులు అవన్నీ చూస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు అభిమానులు ఎక్కువ అయ్యారు. అది ఆశ్చర్యంగా ఉన్నా చాలా ఆనందంగా ఉంది. ఈ జన్మకు ‘ఇది చాలు’ అనిపిస్తుంది’’ అని చంద్రమోహన్ అన్నారు. కరోనా వల్ల ఇండస్ట్రీలో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయని, చాలామంది ఉపాధి దెబ్బ తినడం చాలా బాధ కలిగిస్తోందని చంద్రమోహన్ అన్నారు. తనకు పురస్కారాలు రాకపోవడం పట్ల బాధేమీ లేదని.. ప్రేక్షకుల ఆదరాభిమానాలే పెద్ద అవార్డులని.. తనను మించిన దిగ్గజాలు చాలామందికి వాళ్ల ప్రతిభకు తగ్గ పురస్కారాలు రాలేదని చంద్రమోహన్ అన్నారు.