త‌మ‌న్నా కొట్టింది హిట్టు


‘లైవ్ టెలికాస్ట్’తో కాజల్ అగర్వాల్, ‘పిట్టకథలు’తో శ్రుతి హాసన్‌ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. డిజిటల్ ఎంట్రీ వాళ్లకు పెద్దగా కలిసి రాలేదు. తమన్నాకు సైతం తొలి వెబ్ సిరీస్ ‘లెవెంత్ అవర్’ నిరాశనే మిగిల్చింది. దీంతో సినిమాల్లో తిరుగులేని స్థాయి అందుకున్న స్టార్ హీరోయిన్లకు డిజిటల్ మీడియం అచ్చిరాదనే అభిప్రాయం ఏర్పడింది. ఐతే ఈ అభిప్రాయాన్ని మార్చే దిశగా అడుగు పడింది. తమన్నా నటించిన తర్వాతి వెబ్ సిరీస్ ‘నవంబర్ స్టోరీ’కి మంచి స్పందన వస్తోంది.

సౌత్ స్టార్ హీరోయిన్లలో వెబ్ సిరీస్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న తొలి కథానాయికగా తమన్నా రికార్డు నెలకొల్పేలాగే కనిపిస్తోంది. హాట్ స్టార్‌లో ఈ గురువారం అర్ధరాత్రి నుంచి ‘నవంబర్ స్టోరీ’ స్ట్రీమ్ అవుతోంది. దీని ట్రైలర్ చూసిన ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కలిగింది. ఉత్కంఠ రేపే థ్రిల్లర్ సిరీస్ చూడబోతున్నామన్న అంచనాలు రేకెత్తాయి.

ఈ అంచనాలకు తగ్గట్లే ‘నవంబర్ స్టోరీ’ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగడంతో దీనికి మంచి రివ్యూలు వస్తున్నాయి. చాలా వరకు 3 రేటింగ్‌తో రివ్యూలు ఇచ్చారు ఈ సిరీస్‌కు. ఏడు ఎపిసోడ్ల ఈ సిరీస్‌లో అక్కడక్కడా కథనం కొంచెం నెమ్మదించినప్పటికీ.. చాలా వరకు ఎంగేజింగ్‌గా సాగడం.. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఏదో ఒక విశేషం ఉండటం.. ఆసక్తికర ట్విస్టులు.. ఉత్కంఠ రేకెత్తించే పతాక సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి.

సౌత్‌లో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్‌ల్లో ఇది ఒకటని అంటున్నారు. తమన్నా నటనకూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక మామూలు మధ్య తరగతి అమ్మాయిగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కూడా మాట్లాడుకుంటుున్నారు. ఇంద్ర అనే యువ దర్శకుడు ఈ సిరీస్‌ను రూపొందించాడు. బేసిగ్గా ఇది తమిళంలో తెరకెక్కిన సిరీస్. చాలా వరకు తమిళ నటులే నటించారు. ఇది కొంత మేర తెలుగు ప్రేక్షకులకు ఇబ్బందే. కానీ కంటెంట్ బాగుండటంతో సర్దుకోవచ్చు.