ఆ కుర్రాడిపై ప్ర‌భాస్‌కు ఎంత ప్రేమో..

ఒక స్థాయికి ఎదిగాక అంద‌రూ చుట్టూ చేర‌తారు. అభిమానం చూపిస్తారు. కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తారు. కానీ ఎదుగుతున్న ద‌శ‌లో అలాంటి ప్రోత్సాహం ఉండ‌దు. ఆ స‌మ‌యంలో సాయం చేసిన వాళ్ల‌ను, మ‌న ఎదుగుద‌ల‌కు తోడ్ప‌డిన వాళ్ల‌ను గుర్తించుకోవ‌డం చాలా ముఖ్యం. ఈ ప‌ని అంద‌రూ చేయ‌రు. ఒక స్థాయికి చేరుకున్నాక ఒక‌ప్పుడు సాయ‌ప‌డ్డ వాళ్ల‌ను ప‌ట్టించుకోరు.

ఐతే ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ల‌లో ఒక‌డిగా ఎదిగిన ప్ర‌భాస్ మాత్రం అలాంటి వాడు కాదు. తాను హీరోగా ఎదుగుతున్న ద‌శ‌లో తోడ్పాటు అందించిన వాళ్ల‌పై అత‌ను ఎంతో అభిమానం చూపిస్తుంటాడు. ఇందుకు చాలా ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపిస్తాయి. ఒక‌ప్పుడు ప్ర‌భాస్ కెరీర్లో బిగ్టెస్ట్ హిట్‌గా నిలిచిన వ‌ర్షం సినిమాను రూపొందించిన ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? దీనికి ముందు అత‌ను తీసిన బాబి, త‌ర్వాత చేసిన చంటి డిజాస్ట‌ర్ల‌య్యాయి. కొన్నేళ్ల త‌ర్వాత అత‌ను గుండెపోటుతో చ‌నిపోయాడు.


శోభ‌న్ కొడుకు సంతోష్ శోభ‌న్ గోల్కొండ హైస్కూల్ సినిమాతో న‌టుడిగా ప‌రిచ‌యం అయి ఆ త‌ర్వాత హీరోగా మారి త‌ను నేను, పేప‌ర్ బాయ్ చిత్రాల్లో న‌టించాడు. కానీ అవి అత‌డికి మంచి ఫలితాన్నివ్వ‌లేదు. కాగా ప్ర‌భాస్ త‌న‌కు వ‌ర్షం లాంటి హిట్ ఇచ్చాడ‌న్న కృత‌జ్ఞ‌త‌తో సంతోష్‌ను ఇంత‌కుముందూ ప్ర‌మోట్ చేశాడు. ఇప్పుడూ చేస్తున్నాడు. సంతోష్ కొత్త సినిమా ఏక్ మిని క‌థ ఈ నెల 27న అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ దీని గురించి ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టాడు.

వ‌ర్షం సినిమాను, శోభ‌న్‌ను గుర్తు చేసుకుంటూ సంతోష్‌కు శుభాకాంక్ష‌లు చెప్పాడు. ఈ సినిమాను నిర్మించింది ప్ర‌భాస్ మాతృ సంస్థ అన‌ద‌గ్గ యువి క్రియేష‌న్స్ కావ‌డం విశేషం. దీన్ని బ‌ట్టి సంతోష్‌కు ఈ అవ‌కాశం ద‌క్క‌డంలో ప్ర‌భాస్ పాత్ర కూడా ఉంద‌న్న‌మాటే. త‌న‌కు ఒక హిట్ ఇచ్చాడ‌ని.. శోభ‌న్ కొడుకుని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్ర‌భాస్‌కు అభినంద‌న‌లు చెప్పాల్సిందే.