ఈ రెండు సినిమాలు చూసి తీరాల్సిందే


ఇండియాలో మరోసారి మెజారిటీ ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. థియేటర్లు మూతపడి ఉన్నాయి. దీంతో కొత్త సినీ వినోదం కోసం ప్రేక్షకులు ఓటీటీల వైపే చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రిలీజైన రెండు దక్షిణాది చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి తమిళ చిత్రం ‘కర్ణన్’ కాగా.. ఇంకోటి మలయాళ సినిమా ‘నాయట్టు’. ధనుష్ సినిమా ‘కర్ణన్’ గత నెల 9న థియేటర్లలో రిలీజైనపుడే దాని గురించి పెద్ద చర్చ జరిగింది. 90వ దశకంలో తమిళనాడులోని ఒక ప్రాంతంలో జరిగిన కుల ఘర్షణల నేపథ్యంలో యువ దర్శకుడు మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.

మారి తొలి సినిమా ‘పరియేరుమ్ పెరుమాళ్’ మాదిరే ఇది కూడా సమాజంలోని అణగారిన వర్గాల మీద దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్ష చుట్టూ తిరిగే చిత్రమే. ఎక్కడా ఫలానా కులం అని చెప్పరు కానీ.. ముఖ్యంగా దళితులకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల చుట్టూనే ఆ కథ నడుస్తుంది. దానికి జాతీయ అవార్డు సైతం వచ్చింది. ‘పరియేరుమ్..’కు ఏమాత్రం తగ్గని విధంగా రెండో చిత్రాన్ని కూడా ఒక క్లాసిక్ లాగా తీర్చిదిద్దాడు మారి. ఈసారి అతడికి ధనుష్ లాంటి మేటి నటుడు దొరకడంతో సినిమా మరింత బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. జనాల్లో ఒక కదలిక తీసుకొచ్చే చిత్రం ఇదనడంలో సందేహం లేదు.

ఇక ‘నాయట్టు’ విషయానికి వస్తే కుంచుకోబోబన్, జోజు జార్జ్, నిమిష ప్రధాన పాత్రల్లో మార్టిన్ ప్రకట్ రూపొందించిన ఈ చిత్రం.. కుల రాజకీయాల చుట్టూ తిరిగేదే. అధికారంలో ఉన్న వాళ్లు ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించి తమ ప్రయోజనాల కోసం కొన్నిసార్లు వ్యవస్థలో భాగమైన వ్యక్తులను ఎలా బలి చేస్తారనే కథాంశంతో ఈ హార్డ్ హిట్టింగ్ డ్రామాను తీర్చిదిద్దాడు మార్టిన్. ఇది కూడా జనాలను కదిలించి వారిలో ఒక ఆలోచన తీసుకొచ్చే చిత్రమే. ఈ సినిమాకు థియేటర్లలో మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ఓటీటీలోనూ సినిమాకు అద్భుత స్పందన వస్తోంది. ‘కర్ణన్’ అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుండగా.. ‘నాయట్టు’ నెట్ ఫ్లిక్స్‌లో నడుస్తోంది. ఇంకా ఈ సినిమాలను చూడకుంటే తప్పకుండా ఒక లుక్కేయాల్సిందే.