దయనీయ స్థితిలో ఆ నటి

పావలా శ్యామల.. తెలుగు సినిమాల్లో చాలా తక్కువగా కనిపించే లేడీ కమెడియన్లలో ఒకరు. మరీ పెద్ద పాత్రలేమీ చేయలేదు కానీ.. చిన్న చిన్న పాత్రలతోనే ఈ సీనియర్ నటి ఆకట్టుకుంది. ‘ఆంధ్రావాలా’, ‘గోలీమార్’ లాంటి కొన్ని సినిమాల్లో ఆమె చేసిన కామెడీని అంత సులువుగా మరిచిపోలేం. ఐతే అనారోగ్యం, ఇతర కారణాలతో శ్యామల కొన్నేళ్ల నుంచి సినిమాల్లో కనిపించడం లేదు. శ్యామల ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, పవన్ కళ్యాణ్ ఆమెకు ఆర్థిక సాయం చేశాడని కొన్నేళ్ల కిందట వార్తలొచ్చాయి.

ఇప్పుడు కరోనా కల్లోల సమయంలో ఆరోగ్యం సహకరించక, ఆర్థిక ఇబ్బందులతో ఆమె దయనీయ స్థితిలో ఉన్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. శ్యామలకు తోడు ఆమె కూతురు కూడా అనారోగ్యం పాలై.. వైద్యానికి, తిండికి, ఇంటి అద్దె కట్టడానికి డబ్బుల్లేక అవస్థలు పడుతున్నారట.

శ్యామల ప్రస్తుతం ఎస్‌ఆర్ నగర్‌లోని బీకే గూడలోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటోంది. అనారోగ్యం కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరం కావడంతో ఆమె సంగతి అందరూ మరిచిపోయారు. సినిమా అవకాశాలు పూర్తిగా ఆగిపోయాయి. పెన్షన్‌ ద్వారా ఇల్లు నెట్టుకుంటూ వస్తుండగా.. ఈ మధ్య అది కూడా సరిగా అందడం లేదట. శ్యామలకు రకరకాల ఆరోగ్య సమస్యలుండగా.. ఆమె కూతురు కూడా టీబీ బారిన పడింది. పైగా ఆమె కాలికి గాయం కావడంతో మంచానికి పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. మూడు నెలల నుంచి అద్దె కట్టడం లేదని, తిండికి కూడా కష్టమవుతోందని శ్యామల మీడియాకు తెలిపింది.

శ్యామల పరిస్థితి తెలుసుకుని నటి కరాటే కళ్యాణి ఆమె ఇంటికి వెళ్లి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించడంతో పాటు తన పరిస్థితి మీడియా దృష్టికి తెచ్చారు. తమ ఇద్దరి మందులకే నెలకే రూ.10 వేలు ఖర్చవుతోందని.. తన దగ్గరున్న అవార్డులన్నీ అమ్మి కడుపు నింపుకునే పరిస్థితి వచ్చిందని.. దాతలు, సినీ ప్రముఖులు తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని శ్యామల వేడుకుంటోంది.