చ‌ర‌ణ్ శంక‌ర్‌ను న‌మ్ముకుంటే క‌ష్ట‌మే

Charan Shankar


బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఇమేజ్ మారిపోయిన‌ట్లే ఆర్ఆర్ఆర్ త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌ల ఇమేజ్ కూడా మారిపోతుంద‌ని.. వాళ్లు పాన్ ఇండియా స్టార్లు అయిపోతార‌ని అంచ‌నాలున్నాయి. పెరిగే త‌మ స్థాయికి త‌గ్గ‌ట్లే భారీ ప్రాజెక్టులు సెట్ చేసుకుని ఇంకా పెద్ద రేంజికి వెళ్లాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్‌ల‌తో సినిమాలు ఓకే చేసుకుని ఆర్ఆర్ఆర్ త‌ర్వాత త‌న కెరీర్‌ను తార‌క్ బాగానే ప్లాన్ చేసుకున్నాడు.

ఐతే రామ్ చ‌ర‌ణ్ మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. రెండు నెల‌ల ముందు వ‌ర‌కు ఆర్ఆర్ఆర్ తర్వాత‌ చ‌ర‌ణ్ సినిమా ఏదో క్లారిటీనే లేదు. ఐతే త‌మిళ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో సినిమాను ఓకే చేసుకుని అభిమానుల‌తో వావ్ అనిపించుకున్నాడు. శంక‌ర్ లాంటి ద‌ర్శ‌కుడితో భ‌లేగా సినిమా సెట్ చేసుకున్నాడే అని అంద‌రూ మురిసిపోయారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఈ ప్రాజెక్టుపై ర‌క‌ర‌కాల సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

ఇండియ‌న్-2 సినిమాను మ‌ధ్య‌లో వ‌దిలేసి శంక‌ర్ చ‌ర‌ణ్‌తో సినిమా చేస్తానంటే లైకా అధినేత‌లు అంత తేలిగ్గా వ‌దిలేలా లేరు. ఈ విష‌యంలో ఎంత దూర‌మైనా వెళ్ల‌డానికి వాళ్లు సిద్ధ‌మైన‌ట్లే ఉన్నారు. దీనిపై తెలుగు ఫిలిం చాంబ‌ర్‌కు సైతం లేఖ రాయ‌డంతో దిల్ రాజు లాంటి ప్ర‌ముఖ నిర్మాత మ‌రో ప్రొడ్యూస‌ర్ బాధ‌ను అర్థం చేసుకోకుండా త‌న సినిమాను ముందుకు తీసుకెళ్ల‌లేని ప‌రిస్థితి.

మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్ కూడా రంగంలోకి దిగి వివాదాన్ని ప‌రిష్క‌రించి ఇండియ‌న్‌-2ను ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో శంక‌ర్‌కు ఛాయిస్ లేన‌ట్లే. ఆ సినిమా పూర్త‌య్యాకే చ‌రణ్ సినిమాను మొద‌లుపెట్టాల్సి ఉంటుంది. ఇండియ‌న్‌-2తో త‌ల‌నొప్పులు చాలానే ఉన్నాయి. కాబ‌ట్టి అది మ‌ళ్లీ మొద‌లుపెడితే ఇంకో ఏడాది పాటు శంక‌ర్ బ‌య‌ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు. ఈలోపు చ‌ర‌ణ్ ఖాళీగా ఉండ‌టం క‌ష్టం. కాబ‌ట్టి చ‌ర‌ణ్‌.. శంక‌ర్‌నే న‌మ్ముకోకుండా త‌న కోసం లైన్లో ఉన్న ఇత‌ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రితో ఓ సినిమా లాగించేయ‌డం బెట‌రేమో.