అప్పుడు బాడీ లేద‌న్న ఆ హీరో..


14 ఏళ్ల కింద‌ట అప్ప‌ట్లో పెద్ద సినిమాల‌కు దీటుగా భారీ విజ‌యాన్నందుకున్న సినిమా హ్యాపీ డేస్‌. శేఖ‌ర్ క‌మ్ముల రూపొందించిన ఈ చిత్రంతో చాలామంది కొత్త వాళ్లు ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమాతో వ‌చ్చిన గుర్తింపుతో మంచి మంచి అవ‌కాశాలు అందుకున్నారు. ఆ సినిమాలో బాగా ఆక‌ట్టుకున్న పాత్ర‌ల్లో టైసన్ ఒక‌టి. ఆ పాత్ర‌లో న‌టించిన రాహుల్.. వెరైటీ డైలాగ్ డెలివ‌రీతో, పంచ్‌ల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆ సినిమాలో రాహుల్ మ‌రీ బ‌క్క‌గా ఉండ‌టం వ‌ల్ల అత‌ణ్ని వెట‌కారంగా టైస‌న్ అని పిలుస్తుంటారు స్నేహితులు. ఒక సీన్లో త‌న‌కు బాడీ లేదంటూ స్వ‌యంగా రాహులే ఒక డైలాగ్ కూడా చెబుతాడు.

ఐతే అప్పుడు అంత బ‌క్క‌గా ఉండి.. త‌న మీద త‌నే సినిమాలో కౌంట‌ర్లు వేసుకున్న రాహుల్ ఇప్పుడున్న అవ‌తారం చూస్తే షాక‌వ్వ‌క మాన‌రు. కొన్నేళ్ల కింద‌ట వెంక‌టాపురం అనే సినిమాతో ప‌ల‌క‌రించాడు రాహుల్‌. ఆ సినిమా కోసం అప్ప‌ట్లో కాస్త బాడీ పెంచాడు. ఆ సినిమా వ‌ల్ల కెరీర్‌కు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఐతే కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత రాహుల్ ఇప్పుడు 100 క్రోర్స్ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఈ మ‌ధ్యే ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీదికి వెళ్ల‌నుంది. ఈ చిత్రం కోసం రాహుల్ సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేస్తున్నాడు. బాడీకి తోడు జుట్టు, మీసం కూడా పెంచి రాహుల్ గుర్తు ప‌ట్ట‌లేని విధంగా త‌యార‌య్యాడు.

హ్యాపీడేస్‌లో నాకు బాడీ లేదు అని చెప్పే టైస‌న్ ఫొటో పెట్టి.. ఇప్పుడు క‌ళ్లు చెదిరే రీతిలో బాడీ పెంచిన రాహుల్ కొత్త ఫొటోతో పోలుస్తూ అత‌డి మేకోవ‌ర్ గురించి పోస్టులు పెడుతున్నారు నెటిజ‌న్లు. ఇక‌ 100 క్రోర్స్ సినిమా విష‌యానికి వ‌స్తే.. విరాట్ చ‌క్ర‌వ‌ర్తి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు. ఎస్ఎస్ స్టూడియోస్ బేన‌ర్ మీద నాగం తిరుప‌తి రెడ్డి అనే నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సాక్షి చౌద‌రి ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఒక‌ప్పుడు మీడియం రేంజ్ సినిమాల్లో హ‌వా సాగించి, ఆ త‌ర్వాత సైడ్ అయిపోయిన సాయికార్తీక్ 100 క్రోర్స్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.