పుష్ప’ నిర్మాత చెప్పేశాడు


అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లుగా కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. కానీ చిత్ర బృందంలో మాత్రం దీని గురించి గట్టిగానే ఆలోచిస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. మే నెలాఖరుకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు కూడా యూనిట్ వర్గాలు చెప్పాయి.

ఐతే ఈలోపే మైత్రీ మూవీస్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేసే విషయమై స్పష్టత ఇచ్చేశారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లే ‘పుష్ప’ సినిమాను పార్ట్-1, పార్ట్-2గా విడుదల చేయబోతున్న విషయం వాస్తవమే అని ఆయన ధ్రువీకరించారు. దీనిపై దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌తో కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

“ఎంతో స్పాన్ ఉన్న ‘పుష్ప’ కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం. అందుకే అల్లు అర్జున్, సుకుమార్ గారితో చర్చించి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాం. మొదటి భాగం పూర్తి అయి రిలీజ్ కాగానే రెండో భాగం మొదలుపెడతాం. రెండో భాగం కోసం అనుకున్న కథలో ఇప్పటికే 10 శాతం చిత్రీకరణ పూర్తయింది” అని రవిశంకర్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.

స్వయంగా నిర్మాత చెప్పాడు అంటే ‘పుష్ప’ రెండు భాగాలుగా రాబోతుందన్న విషయం ఖరారైనట్లే. ఇంతకుముందు బాహుబలి ఇలాగే ఒక సినిమాగా మొదలై, మేకింగ్ మధ్యలో ఉండగా రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయాలని రాజమౌళి అండ్ కో నిర్ణయించారు. ‘కేజీఎఫ్’ సినిమాను మాత్రం మొదలైనపుడే చాప్టర్-1, చాప్టర్-2గా రిలీజ్ చేసే ఉద్దేశంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ వరుసలో ‘పుష్ప’ లాంటి మరో భారీ చిత్రం రెండు భాగాల రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)