‘నెగెటివ్’ తర్వాత పిల్లలతో బన్నీ వీడియో చూశారా?


సినిమా హీరోలు కుటుంబాన్ని వదిలి వారాలు, నెలలు ఔట్ డోర్ షూటింగ్‌కు వెళ్లడం మామూలే. విదేశాల్లో పెద్ద షెడ్యూల్ ఉంటే కుటుంబాన్ని విడిచిపెట్టి చాలా రోజులు వెళ్లాల్సి ఉంటుంది. ఐతే అలా చాలా రోజులు దూరమయ్యాక తిరిగి కుటుంబాన్ని కలిసినపుడు ఉండే ఆనందమే వేరు. ఐతే పని మీద వేరే చోటికి వెళ్లి కుటుంబానికి దూరంగా ఉండటం వేరు. అలా కాకుండా ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం వేరు.

రోజూ ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆడుకునే పిల్లలను దగ్గరికి రానివ్వకుండా.. దూరం నుంచి చూసి సరిపెట్టుకోవాల్సి రావడం, వాళ్లు మన దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో అని భయపడటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కరోనా మహమ్మారి ఇలాంటి దుస్థితినే కల్పిస్తోంది. కుటుంబంలో ఒకరు కరోనా బారిన పడితే.. అందరికీ దూరంగా ఐసొలేట్ కాక తప్పదు. కనీసం రెండు వారాలు అందరికీ దూరంగా ఉండాల్సిందే.

గత రెండు వారాల నుంచి హీరో అల్లు అర్జున్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతను తన ఇంట్లోనే మేడ మీది గదిలో ఐసొలేట్ అయ్యాడు. భార్య, సహాయకులు ఆయనకు అవసరమైనవి అందిస్తూ వచ్చారు. వీడియో కాల్ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మందులు వేసుకుంటూ బన్నీ విజయవంతంగా కరోనా గండాన్ని దాటాడు. బుధవారం అతడికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. 15 రోజుల క్వారంటైన్ అనంతరం అతను మేడ మీది నుంచి కిందికి వచ్చాడు. ఈ సందర్భంగా ఒక వీడియో తీయించి దాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు.

లిఫ్ట్ నుంచి బయటికొచ్చి తన కొడుకును చూస్తూ ‘నాకు నెగెటివ్ వచ్చింది’ అని చెబుతూ చేతులు చాచగానే అయాన్ వచ్చి బన్నీని హత్తుకున్నాడు. ఇద్దరూ అలా కౌగిలించుకుని కింద పడి దొర్లేశారు. తర్వాత బన్నీ కూతురు అర్హ తండ్రి దగ్గరికి వస్తే ఆమెను ముద్దుల్లో ముంచెత్తాడు. చాలా క్యూట్‌గా, ఎమోషనల్‌గా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.