రజినీ.. హమ్మయ్య ఓ పనైపోయింది


సూపర్ స్టార్ రజినీకాంత్ తన జీవితంలోనే అతి పెద్ద టాస్క్‌ను పూర్తి చేశారు. తన కొత్త చిత్రం ‘అన్నాత్తె’ చిత్రీకరణను ఆయన ముగించేశారు. మామూలుగా ఒక స్టార్ హీరో నటిస్తున్న సినిమా షూటింగ్ అయిపోతే అది పెద్ద వార్తేమీ కాదు. కానీ ‘అన్నాత్తె’ సినిమాను రజినీ పూర్తి చేయడం మాత్రం పెద్ద వార్తాంశమే. ఎందుకంటే ఆయన విపత్కర పరిస్థితుల్లో భయం భయంగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఒక రకంగా ఆయన తన లైఫ్‌నే రిస్క్ చేశారని చెప్పొచ్చు.

ఏడాదికి పైగా దేశంలో కరోనా వైరస్ ఎలాంటి కల్లోలం రేపుతోందో తెలిసిందే. ఆ మహమ్మారి ధాటికి ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా ఉన్న ఎంతోమంది సెలబ్రెటీలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి దిగ్గజ గాయకుడి మరణంతో కోట్లాది మంది ఎలా తల్లడిల్లిపోయారో తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రముఖులు ఇల్లు దాటి కాలు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు. రజినీ సైతం గత ఏడాది ఐదారు నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యారు. ఐతే తర్వాత ధైర్యం చేసి ‘అన్నాత్తె’ షూటింగ్‌కు హాజరైతే.. యూనిట్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. రజినీకి కూడా చిన్న ఆరోగ్య సమస్య తలెత్తింది.

ఇక అంతే.. రజినీ భయపడిపోయారు. షూటింగ్ ఆపేయడమే కాదు.. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచననే విరమించుకున్నారు. దీనిపై ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. ఐతే రాజకీయాల్లోకి వెళ్లడం వెళ్లకపోవడం రజినీ వ్యక్తిగత విషయం. కానీ వందల కోట్లతో ముడిపడ్డ సినిమాను మధ్యలో వదిలేయలేరు కదా. ఇప్పటికే ‘అన్నాత్తె’ సినిమా బాగా ఆలస్యం అయింది. అందుకే అన్ని జాగ్రత్తల మధ్య సినిమా చిత్రీకరణలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు సూపర్ స్టార్.

ఒక వైద్య బృందాన్ని వెంట పెట్టుకుని హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో అన్ని జాగ్రత్తల మధ్య రజినీ చిత్రీకరణలో పాల్గొన్నారు. వివిధ పరిశ్రమల్లో యంగ్ హీరోలు సైతం షూటింగ్‌లు ఆపేసి ఇంటికి పరిమితం అయితే.. ఈ విపత్కర పరిస్థితుల్లో విరామం లేకుండా 35 రోజుల పాటు షూట్‌లో పాల్గొన్నారు రజినీ. ఎలాగైతేనేం ఏ ఇబ్బందీ లేకుండా సినిమా షూటింగ్ అయిపోయింది. తన పని ముగించి చెన్నైకి వెళ్లిపోయారు సూపర్ స్టార్. ఇక దర్శకుడు శివ అండ్ కో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా నవంబరు 5న విడుదల చేయాలన్నది ప్లాన్.