నాగ్ ఈ కష్టాలు ఎందుకని..

సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతోంది ఈ మధ్య. మునుపటి తరం స్టార్ల లాగా తమ వయసులో మూడో వంతు వయసున్న హీరోయిన్లతో ఎంచక్కా చిందులు వేసేస్తే ఇప్పటి ప్రేక్షకులు ఒప్పుకోరు. సోషల్ మీడియాలో ఏకిపడేస్తారు. అలాగని చేసిన హీరోయిన్లతోనే మళ్లీ చేస్తే మొహం మొత్తేస్తుంది.

ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలు కొత్త సినిమా మొదలుపెడుతున్నారంటే హీరోయిన్ ఎవరా అనే తలనొప్పి మొదలవుతుంది. ఐతే సౌత్‌లో వెతుకుతూ కూర్చుంటే కష్టమని భావించి అక్కినేని నాగార్జున ఈ మధ్య వరుసగా బాలీవుడ్ భామల వైపు చూస్తున్నాడు. ఆయన చివరి సినిమా ‘వైల్డ్ డాగ్’లో బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జాతో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు కూడా నాగ్ ఆఫీసర్, దేవదాస్ సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లతోనే జత కట్టాడు.

ఇప్పుడు నాగ్ నటించబోయే అచ్చ తెలుగు సినిమా కోసం కూడా ఓ హిందీ హీరోయిన్‌నే తీసుకోనున్నారట. ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న ‘బంగార్రాజు’ చిత్రాన్ని నాగ్ త్వరలోనే మొదలుపెట్టాలనుకుంటున్న సంగతి తెలిసిందే. జులైలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటించనుందట. హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ల సరసన సోనాక్షి నటించింది. దక్షిణాదిన సూపర్ స్టార్ రజినీకాంత్‌తోనూ ఆమె జోడీ కట్టింది.

ట్రెడిషనల్‌గా కనిపించే సోనాక్షిని ‘బంగార్రాజు’లో నటింపజేస్తే బాగుంటుందని నాగ్ ఫీలయ్యాడట. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా ఓకే అనడంతో ఆమెనే ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ప్రవీణ్ సత్తారు సినిమాను మొదలుపెట్టి అది పూర్తయ్యాక ‘బంగార్రాజు’ను మొదలుపెట్టాలని నాగ్ చూస్తున్నాడు.