ఈ మధ్య కాలంలో తమిళంలో చర్చనీయాంశంగా మారిన చిత్రం.. మండేలా. కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో అశ్విన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న ఒక ఊరిలో పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్ధం కావడం.. ఇరు కులాల ఓట్లు సమానంగా ఉండి, ఆ ఊరి వాళ్లందరూ చాలా తక్కువగా చూసే ఒక క్షురకుడి ఓటు కీలకంగా మారడం.. అతడి చుట్టూ ఇరు వర్గాలూ తిరగడం.. ఈ నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా సాగుతుందీ చిత్రం.
రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎక్కడిదాకా వెళ్తారన్నది సెటైరికల్‌గా చాలా బాగా చూపించాడు దర్శకుడు. ఓటు విలువ ఏంటో తెలియజెప్పే సినిమా ఇది. వినోదం పంచుతూనే మంచి సందేశాన్ని అందించే ఈ చిత్రం నెట్ ఫ్లెక్స్‌లో రిలీజ్ కాగా.. అన్ని భాషల వాళ్లూ బాగానే ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ‘మండేలా’ రీమేక్ హక్కులు తీసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే ముందుగా బండ్ల గణేష్ రీమేక్ హక్కుల కోసం ప్రయత్నించాడని.. ఆయనే లీడ్ రోల్ చేయాలనుకున్నాడని.. కానీ ఆయన స్థానంలోకి మరో కమెడియన్ సునీల్ వచ్చాడని ఓ ప్రచారం నడిచింది. దీని గురించి ఓ వార్త రాగా.. దానిపై బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించాడు ట్విట్టర్లో. “ఒప్పుకుంటే కదా తప్పుకోవడానికి” అని బండ్ల గణేష్ కామెంట్ చేశాడు.
తద్వారా ఈ సినిమా రేసులో తాను ఎప్పుడూ లేనని చెప్పకనే చెప్పినట్లయింది. బహుశా ఈ చిత్రంలో సునీలే నటిస్తుండొచ్చు. ఒకప్పటి సునీల్ అయితే ఈ పాత్రకు బాగానే సూటవుతాడు. కాకపోతే మధ్యలో హీరో ఇమేజ్ కోసం వెంపర్లాడటం, రూపం మారిపోవడం వల్ల ఇప్పుడు యోగిబాబు చేసిన క్షురకుడి పాత్రకు ఎంతమాత్రం నప్పుతాడన్నది కాస్త సందేహమే. చూద్దాం మరి సునీల్‌ను ఈ సినిమాలో ఎలా ప్రెజెంట్ చేస్తారో?