సీనియర్ కమెడియన్ వివేక్ మృతి తర్వాత కోలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కెవి ఆనంద్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కథలో వైవిధ్యం కోరుకునే దర్శకుల్లో ఆయన కూడా ఒకరు.
కెరీర్ ఆరంభంలో ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఒకేఒక్కడు, బాయ్స్, శివాజీ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగులో 1995లో పుణ్యభూమి నాదేశం అనే చిత్రం కోసం పనిచేశారు. 2005లో కెవి ఆనంద్ తొలిసారి దర్శకుడిగా మారి ‘కాన కందన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత మరోసారి దర్శకుడిగా స్టార్ హీరో సూర్యతో ‘అయాన్’ (తెలుగులో వీడోక్కడే) చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ ప్రతిభని అందరికీ తెలిసేలా చేసింది ఈ చిత్రమే.
ఆ తర్వాత ఆనంద్ తెరకెక్కించిన రంగం ఎంతటి ఘనవిజయమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్యతో రెండవసారి తెరకెక్కించిన బ్రదర్స్ ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ దర్శకుడిగా ఆనంద్ అద్భుతమైన పనితనాన్ని చూపించారు. కెవి ఆనంద్ ఓ స్టార్ డైరెక్టర్ అని చెప్పడానికి ఈ మూడు చిత్రాలు చాలు.
చివరగా ఆనంద్ దర్శత్వం వహించిన చిత్రం కాప్పాన్. రంగం, వీడోక్కడే చిత్రాలని ప్రేక్షకులు ఇప్పటికి రిపీటెడ్ గా చూస్తూనే ఉన్నారు. కెవి ఆనంద్ మృతితో ఆయనతో క్లోజ్ గా అసోసియేట్ ఐన హీరో సూర్య విషాదంలో మునిగిపోయారు. కోలీవుడ్ తో పాటు దక్షణాది సినీ ప్రముఖులంతా ఆనంద్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.