రానాతో ‘జంబలకిడి పంబ’ ప్రొడ్యూసర్

బహుబలి సినిమాల తర్వాత రానా దగ్గుపాటి స్పీడు పెంచేసాడు. వరస పెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. కొత్త కొత్త కథలు, నిర్మాతలు, డైరక్టర్స్ తో కొలాబరేట్ అవుతున్నాడు. ఎక్కడ చిన్న గ్యాప్ ఉన్నా ఆ రోజుని షూటింగ్ డే గా మార్చేస్తున్నాడు. ఆయన స్పీడు చూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది. రీసెంట్ గా ‘అరణ్య’ అంటూ వచ్చిన రానా ‘విరాట పర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే, పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అయ్యపనం కోషియం’ రీమేక్ లో నటిస్తున్నాడు రానా. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమా కమిటయ్యినట్లు సమాచారం.

సీనియర్ నిర్మాత ఆచంట గోపినాథ్ ప్రొడక్షన్ లో చేయటానికి సైన్ చేస్తున్నారు. ఆచంట గోపినాథ్ గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘టాప్ హీరో’, ‘దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ వంటి సినిమాలను నిర్మించారు. ఆ మధ్యన నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ ‘ఇమైక్క నొడిగల్’ను తెలుగులో ‘అంజలి సిబిఐ’గా విడుదల చేశారు.

ఇంతకాలం సరైన ప్రాజెక్టు దొరక్క గ్యాప్ తీసుకున్న ఆయన సురేష్ బాబుతో ఉన్న పరిచయంతో రానాతో ముందుకు వెళ్లటానికి రెడీ అవుతున్నారు. ఓ మంచి కాన్సెప్ట్ తో .. రానా దగ్గుబాటి హీరోగా ఈ భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు ఆచంట గోపినాథ్. ఈ మేరకు ఓ స్టార్ డైరక్టర్ చెప్పిన కథ నచ్చిందని, రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మిగతా పనులు కాస్త కరోనా తగ్గాక మొదలెడదామని ఆగారట.

ఈ విషయమై మాట్లాడుతూ…“ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా సినిమా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ కథ ఓకే అయ్యింది. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం” అని అన్నారు ఈ నిర్మాతలు ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు.