అఖండ టీజ‌ర్ వ్యూస్ సీక్రెట్ ఏంటి?

నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త చిత్రం అఖండ లేటెస్ట్ టీజ‌ర్‌కు యూట్యూబ్‌లో వ‌స్తున్న రెస్పాన్స్ చూసి అంద‌రూ విస్తుబోతున్నారు. అఖండ టైటిల్ రోర్ పేరుతో ఈ నెల 13న రిలీజ్ చేసిన ఈ టీజ‌ర్‌.. తొలి రోజు నుంచి యూట్యూబ్‌లో అనూహ్య‌మైన వ్యూస్ తెచ్చుకుంటోంది. ఇప్ప‌టికే ఈ టీజ‌ర్ వ్యూస్ 45 మిలియ‌న్ల‌కు చేరుకున్నాయి.

త్వ‌ర‌లోనే 50 మిలియ‌న్ మార్కును అందుకోవ‌డం కూడా లాంఛ‌న‌మే అనిపిస్తోంది. మామూలుగా కొత్త టీజ‌ర్లు ఏవైనా విడుద‌లైతే ఒక‌ట్రెండు రోజులు బాగానే జోరు క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత వ్యూస్ త‌గ్గుతాయి. కానీ అఖండ టీజ‌ర్ మాత్రం తొలి రోజు నుంచి అదే దూకుడు మీద ఉంది. అంత‌కంత‌కూ వ్యూస్ పెరుగుతూ పోతున్నాయి. బాల‌య్య సినిమాకు మ‌రీ ఈ స్థాయి వ్యూస్ రావ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్, సాహో లాంటి భారీ చిత్రాల రికార్డుల‌ను అఖండ టీజ‌ర్ అల‌వోక‌గా దాటేయ‌డం గ‌మ‌నార్హం.

ఎంత బోయ‌పాటి శ్రీనుతో బాల‌య్య జోడీ క‌ట్టిన‌ప్ప‌టికీ మ‌రీ ఇంత క్రేజా అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. టీజ‌ర్ మ‌రీ సెన్సేష‌న‌ల్‌గా కూడా ఏమీ లేక‌పోవడంతో ఈ వ్యూస్ వెనుక సీక్రెట్ ఏంటి అని ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు జ‌నాలు. త‌ద్వారా తెలిసిందేమంటే.. ఈ టీజ‌ర్‌ను యాడ్స్ రూపంలో ప్ర‌మోట్ చేస్తుండ‌టం వ‌ల్లే వ్యూస్ ఈ స్థాయిలో వ‌స్తున్నాయ‌ట‌. అందుకోసం చాలా ఖ‌ర్చు పెట్టార‌ట నిర్మాత‌. ఈ రోజుల్లో టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు వ‌చ్చే స్పంద‌న‌ను బ‌ట్టి కూడా సినిమాల‌కు బిజినెస్ జ‌రుగుతోంది.

బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్‌కు తోడు.. టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అయితే సినిమాకు బిజినెస్ ప‌రంగా క‌లిసొస్తుంద‌ని నిర్మాత బాగా ఖ‌ర్చు పెట్టి టీజ‌ర్‌ను ప్ర‌మోట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే అఖండ టీజ‌ర్‌కు ఆ వ్యూస్ అని అంటున్నారు. బాల‌య్య గ‌త సినిమాల టీజ‌ర్లు, ట్రైల‌ర్కు వచ్చిన వ్యూస్.. అఖండ టైటిల్ రోర్‌కు వ‌చ్చిన వ్యూస్ పోల్చి చూస్తే ఇది నిజ‌మే అనిపించ‌క‌మాన‌దు.