మళ్లీ సినిమాలు చేయాలనుకున్నాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు మామూలుగా లేదు. ఇప్పటికే రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ను పూర్తి చేసి రిలీజ్ చేశాడు. ఇంకో రెండు సినిమాలను చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్.. ఈ రెండూ కూడా సగానికి పైగానే చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇంకా హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇంకా మరికొందరు దర్శకులు, నిర్మాతలు పవన్ కోసం ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్‌తోనూ ఓ సినిమాను పవన్ తప్పక చేస్తాడని అంటున్నారు.
2024 ఎన్నికలకు సిద్ధం కావడానికి ముందు ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పవన్ పూర్తి చేయగలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అలాంటిది పవన్ తాజాగా మరో నిర్మాణ సంస్థకు కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సంస్థే జేబీ ఎంటర్టైన్మెంట్స్.
ప్రస్తుతం డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద భారీ చిత్రాలు నిర్మిస్తున్న దానయ్యతో కలిసి ఇంతకుముందు ‘బాలాజీ ఆర్ట్ మీడియా’ బేనర్ మీద సినిమాలు నిర్మించారు భగవాన్, పుల్లారావు. మధ్యలో ‘రెబల్’ సహా కొన్ని సినిమాలు దారుణమైన దెబ్బ కొట్టడంతో నిర్మాణం ఆపేశారు. కొంచెం గ్యాప్ తర్వాత ‘జేబీ ఎంటరట్టైన్మెంట్స్’ పేరుతో కొత్త సంస్థ పెట్టి సాయిధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో ‘రిపబ్లిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజుతో సినిమా చేయడం ద్వారానో ఏమో పవన్ కళ్యాణ్‌తో యాక్సెస్ దొరికి ఆయన్నుంచి కమిట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పవన్‌తో ఈ ఏడాదే సినిమా చేద్దామనుకున్నామని.. కానీ ఆయనకున్న వేరే కమిట్మెంట్ల వల్ల కుదరలేదని.. కానీ వచ్చే ఏడాది మాత్రం కచ్చితంగా పవన్‌తో తమ సంస్థలో సినిమా ఉంటుందని ధీమాగా చెప్పారు భగవాన్, పుల్లారావు. మరి ఇన్ని కమిట్మెంట్ల మధ్య ఈ నిర్మాతలకు పవన్ ఎప్పుడు అవకాశమిస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates