మ్యాక్స్‌వెల్-ప్రీతి జింతా.. మీమ్స్ మోత


ఐపీఎల్ మ్యాచ్ అయ్యిందంటే చాలు.. కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతాయి మీమ్స్. మ్యాచ్‌లను ఎంతగా ఎంజాయ్ చేస్తారో.. ఈ మీమ్స్‌ను అంతకంటే ఎక్కువగా ఆస్వాదిస్తారు నెటిజన్లు. ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌ తర్వాత సోషల్ మీడియాలో మీమ్ ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఆ మ్యాచ్‌లో ప్రదర్శనలను బట్టి మీమ్ క్రియేటర్స్ తమ క్రియేటివిటీని చూపిస్తుంటారు. ముఖ్యంగా తెలుగు మీమ్ పేజీలకు బోలెడంత సరకు ఇచ్చేస్తుంటాయి ఐపీఎల్ మ్యాచ్‌లు. సందర్భానికి తగ్గట్లు బ్రహ్మానందం హావభావాలకు లోటుండదు. ఆయన నటించిన సినిమాల సన్నివేశాల్ని కూడా సందర్భానికి తగ్గట్లు భలేగా వాడేసుకుంటూ ఉంటారు.

తాజాగా మీమ్ క్రియేటర్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌ పండుగలా మారింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ అదరగొట్టాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో 78 పరుగులు చేశాడు.

ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ మ్యాక్స్‌వెల్ చెలరేగిపోయాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐతే ఇదే మ్యాక్స్‌వెల్ గత కొన్ని సీజన్ల నుంచి పంజాబ్ తరఫున తేలిపోయాడు. 2014లో యూఏఈ-ఇండియా వేదికగా జరిగిన ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ చెలరేగిపోవడంతో అప్పట్నుంచి పంజాబ్ జట్టు అతడి మీద చాలా నమ్మకంతో ఉంటోంది. కానీ ఆ తర్వాత ఒక్క సీజన్లోనూ అతను మెరుపులు మెరిపించలేకపోయాడు. గత సీజన్లో అయితే మరీ దారుణంగా ఆడాడు. మొత్తం సీజన్ అంతా కలిపి చేసింది 108 పరుగులు. సీజన్ అంతా ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. అలాంటిది ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున 3 మ్యాచుల్లోనే 176 పరుగులు చేశాడు. 8 సిక్సర్లు బాదాడు.

ఈ నేపథ్యంలో పంజాబ్ యజమాని ప్రీతి జింతా-మ్యాక్స్‌వెల్ కాంబినేషన్లో మీమ్స్ మోత మోగిపోతోంది. మ్యాక్స్‌వెల్ పంజాబ్ తరఫున తుస్సుమనిపించి బెంగళూరు తరఫున చెలరేగిపోవడంపై ప్రీతి మండిపోతున్నట్లుగా ఉన్న మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ‘కింగ్’ సినిమాలో జయసూర్యగా మ్యాక్సీని, త్రిషగా ప్రీతిని పెట్టి తయారు చేసిన మీమ్ సహా అన్నీ కూడా నెటిజన్లను భలే నవ్విస్తున్నాయి.