బ‌న్నీ-కొర‌టాల.. ఆగిపోలేదు


సోమ‌వారం జూనియ‌ర్ ఎన్టీఆర్-కొర‌టాల శివ కొత్త సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఆర్ఆర్ఆర్ త‌ర్వాత తారక్ చేయాల్సిన సినిమాకు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సింది. కానీ ఏవో కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. త్రివిక్ర‌మ్ స్థానంలోకి కొర‌టాల శివ వ‌చ్చాడు. శివ మిత్రుడైన మిక్కిలినేని సుధాక‌ర్.. యువ సుధ ఆర్ట్స్ బేన‌ర్ మీద ఈ సినిమాను నిర్మించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డైంది.

కానీ ఇదే బేన‌ర్లో కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో.. అల్లు అర్జున్ హీరోగా మ‌రి కొన్ని నెల‌ల్లో సినిమా మొద‌లు కావాల్సి ఉంది. ఆ సినిమాను వ‌చ్చే వేస‌వికి షెడ్యూల్ చేశారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి ఎన్టీఆర్-కొర‌టాల శివ సినిమా రావ‌డంతో అయోమ‌యం నెల‌కొంది.

మొన్న ఎన్టీఆర్-కొర‌టాల సినిమా అనౌన్స్ కావ‌డం ఆల‌స్యం.. త‌మ హీరోతో కొర‌టాల సినిమా సంగ‌తేంటంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో గొడ‌వ పెట్టేశారు. అల్లు అర్జున్ 21వ సినిమాగా అది తెర‌కెక్కాల్సింది. ఈ నేప‌థ్యంలో #AA21 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది కూడా. ఐతే వెంట‌నే ఈ విష‌యంపై కొర‌టాల కానీ, నిర్మాత కానీ స్పందించ‌లేదు. ఒక రోజు గ‌డిచాక కొంచెం తీరిగ్గా నిర్మాణ సంస్థ నుంచి స్ప‌ష్ట‌త వ‌చ్చింది. యువ సుధ ఆర్ట్స్ ట్విట్ట‌ర్ అకౌంట్లో వివ‌ర‌ణ ఇచ్చారు.

బ‌న్నీతో కొర‌టాల సినిమా త‌మ బేన‌ర్లోనే క‌చ్చితంగా ఉంటుంద‌ని.. అది ఆగిపోలేద‌ని.. 2022 ఏప్రిల్ త‌ర్వాత ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని చెప్పారు. గీతా ఆర్ట్స్ వాళ్ల‌తో ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే మ‌ధ్య‌లో తార‌క్ సినిమాను మొద‌లుపెడుతున్న‌ట్లు తెలిపారు. అంటే తార‌క్‌తో సినిమా అవ్వ‌గానే బ‌న్నీ చిత్రాన్ని కొర‌టాల మొద‌లుపెడ‌తాడ‌న్న‌మాట‌. ఈ లోపు పుష్ప పూర్తి చేశాక‌ బ‌న్నీ.. వేరే ద‌ర్శ‌కుడితో ఓ సినిమా చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌. మ‌రి ఆ అవ‌కాశం ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి.