లా ప్రాక్టీసుకు హాట్ హీరోయిన్

డాక్టర్ కాబోయి.. ఇంకేదో అవ్వబోయి యాక్టర్ అయిన వాళ్లు చాలామంది ఉంటారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాక చదువును పక్కన పెట్టేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం నటనలోకి అడుగు పెట్టాక కూడా చదువు మీద ఆసక్తి కోల్పోరు. కొంత సమయాన్ని చదువుకు కేటాయించి డిగ్రీలు సంపాదిస్తుంటారు. కొందరు నటనను పక్కన పెట్టి మరీ చదువు వైపు అడుగులు వేస్తుంటారు.

కొన్నేళ్ల కిందట బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా మంచి స్థాయిలో ఉన్నా కూడా సినిమాలు వదిలేసి చదువు కోసం యుఎస్ వెళ్లిపోయింది. అక్కడ ఎంబీఏ చేసి ఉద్యోగంలో చేరింది. అక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడిపోయింది. ఇక వర్తమానంలోకి వస్తే సినిమాల్లో నటిస్తూనే చదువుకుంటున్న హీరోయిన్లు కొంతమంది ఉన్నారు. నేల టిక్కెట్టు, రెడ్ లాంటి సినిమాల్లో నటించిన హాట్ హీరోయిన్ మాళవిక శర్మ కూడా చదువు విషయంలో చాలా సీరియస్‌గా ఉన్న సంగతి వెల్లడైంది.

మాళవిక శర్మ చడీచప్పుడు లేకుండా ఎల్‌ఎల్బీ పూర్తి చేసేయడం విశేషం. ముంబయిలోని రిజ్వి లా కాలేజీ నుంచి ఆమె గత నవంబరులో లా డిగ్రీ కూడా తీసుకుందట. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైకోర్టులో జూనియర్ లాయర్‌గా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిందట. జనవరిలోనే ఆమెకు మహారాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి లా ప్రాక్టీస్ కోసం లైసెన్స్ కూడా వచ్చిందట. అది వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్‌లో మాళవిక ప్రాక్టీస్ మొదలుపెట్టింది.

పెద్ద హీరోయిన్ కాగల లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ సరైన బ్రేక్ లేక మాళవిక ఇబ్బంది పడుతోంది. ‘నేల టిక్కెట్టు’ లాంటి డిజాస్టర్‌తో ఎంట్రీ ఇవ్వడం ఆమె కెరీర్‌కు చేటు చేసింది. చివరగా ఆమె నటించిన ‘రెడ్’ కూడా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. అయినప్పటికీ ఆశలు కోల్పోకుండా సినిమాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న మాళవిక.. అక్కడ అంత బిజీగా ఏమీ లేకపోవడంతో లా ప్రాక్టీస్‌ను మొదలుపెట్టినట్లుంది. మున్ముందు అవకాశాలు రాకుంటే ఇలాగే సెటిలైపోతుందేమో.