ప్రస్తుతం టాలీవుడ్ అనే కాదు.. ఇండియా మొత్తంలో ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ ఉన్నంత ఫామ్‌లో ఇంకెవరూ లేరంటే అతిశయోక్తి లేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా వివిధ భాషల్లో అతను సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇలా నాలుగు భాషల్లో సినిమాలు చేస్తున్న సంగీత దర్శకుడు ఇంకెవరూ కనిపించరు. ఇంత బిజీ టైంలో కూడా ప్రతి సినిమాకూ మంచి ఔట్ పుట్ ఇవ్వగలుగుతున్నాడతను.
తాజాగా కన్నడలో విడుదలైన ‘యువరత్న’కు తమన్ పాటలు, నేపథ్య సంగీతం పెద్ద ప్లస్ అయ్యాయి. తెలుగులో వచ్చిన ‘వైల్డ్ డాగ్’లోనూ తమన్ నేపథ్య సంగీతానికి ప్రశంసలు దక్కుతున్నాయి. వచ్చే వారం విడుదల కానున్న ‘వకీల్ సాబ్’తోనూ తమన్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. సర్కారు వారి పాట, అయ్యప్పనుం కోషీయుం రీమేక్ సహా వివిధ భాషల్లో అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్టులకు అతను సంగీతం సమకూరుస్తుండటం విశేషం.
ఇవన్నీ ఒకెత్తయితే.. తమన్ చేతికి మరో భారీ ప్రాజెక్టు రాబోతుండటం మరో ఎత్తు. అది తమన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ అంటున్నారు. రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందించబోయే సినిమాకు తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మామూలుగా శంకర్ ఏఆర్ రెహమాన్‌తోనే ఎక్కువ పని చేస్తుంటాడు. కానీ ‘ఇండియన్-2’కు ఆయన్ని కాదని అనిరుధ్‌ను ఎంచుకున్నాడు.
చరణ్ సినిమాకు కూడా అనిరుధే సంగీత దర్శకుడని ముందు వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు తమన్ ఫైనలైజ్ అయినట్లు చెబుతున్నారు. చెన్నై మీడియానే ఈ మేరకు వార్తలు ఇస్తోంది. తమన్ ఉన్న ఫామ్ చూస్తే అతడితోనే పని చేయించుకోవాలని అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఐతే ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమన్ తన దగ్గరికి వచ్చే ఏ ప్రాజెక్టునూ వదులకోవట్లేదు. అందులోనూ శంకర్-చరణ్ సినిమాకు సంగీతం చేసే ఛాన్స్ అంటే అతనెలా విడిచిపెడతాడు?
Gulte Telugu Telugu Political and Movie News Updates