డిజాస్టర్ మూవీకి పట్టం

అక్షయ్ కుమార్ నుంచి చివరగా వచ్చిన ‘లక్ష్మి’ సినిమాకు ఎంత నెగెటివ్ రివ్యూలు వచ్చాయో తెలిసిందే. కరోనా నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఈ చిత్రాన్ని గత ఏడాది చివర్లో హాట్ స్టార్ ద్వారా నేరుగా ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. అప్పుడు ఈ సినిమాకు దారుణమైన రివ్యూలు వచ్చాయి. అక్షయ్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా విశ్లేషకులు తీర్మానించారు.

సోషల్ మీడియాలో కూడా పూర్తిగా నెగెటివ్ టాకే వినిపించింది. కానీ అదేమీ ఈ సినిమాకు వ్యూస్‌ను తగ్గించలేకపోయింది. హాట్ స్టార్‌లో ఈ సినిమాను విరగబడి చూశారు ప్రేక్షకులు. హాట్ స్టార్ చరిత్రలోనే కాదు.. మొత్తం ఇండియన్ ఓటీటీ సినిమాల్లోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా ‘లక్ష్మి’ రికార్డు నెలకొల్పడం విశేషం. తాజాగా ఈ చిత్రాన్ని టీవీల్లో ప్రిమియర్‌గా వేయగా.. అక్కడ కూడా రికార్డులు బద్దలు కొట్టేసింది ‘లక్ష్మి’ మూవీ. దానికి సంబంధించిన వివరాలు తాజాగా బయటికి వచ్చాయి.

ఇటీవలే స్టార్ గోల్డ్ ఛానెల్లో ‘లక్ష్మి’ ప్రిమియర్ వేయగా.. ఏకంగా 2.5 కోట్ల ఇంప్రెషన్స్ వచ్చాయి. దీంతో ఇండియన్ శాటిలైట్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా ‘లక్ష్మి’ రికార్డు నెలకొల్పింది. పాత రికార్డును భారీ తేడాతో ఇది బద్దలు కొట్టేసింది. లాక్ డౌన్ టైంలో హాట్ స్టార్‌కు భారీగా సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయి. దేశంలో టీవీలున్న మెజారిటీ ఇళ్లలోకి హాట్ స్టార్ వెళ్లింది. దీంతో మెజారిటీ ప్రేక్షకులు ఆ సినిమా చూశారు. అయినప్పటికీ ఇప్పుడు టీవీలో ప్రిమియర్ వేస్తే ఈ స్థాయిలో ఆదరణ దక్కడం విశేషమే.

సౌత్‌లో బ్లాక్‌బస్టర్ అయిన ‘కాంఛన’ చిత్రానికి ‘లక్ష్మి’ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. హిందీలో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ, శరద్ ఖేల్కర్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఒరిజినల్ డైరెక్టర్ రాఘవ లారెన్సే డైరెక్ట్ చేశాడు. కరోనా నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్‌కు అవకాశం లేకపోవడంతో ఈ చిత్ర డిజిటల్ హక్కులను హాట్ స్టార్ వాళ్లకు రూ.90 కోట్లకు అమ్మేశారు నిర్మాతలు.