‘ఆర్ఆర్ఆర్’ డీల్ డన్.. బెల్లంకొండ హ్యాపీ

‘ఆర్ఆర్ఆర్’ డీల్ క్లోజ్ అయితే.. బెల్లంకొండ శ్రీనివాస్ సంతోషపడటం ఏంటి అనిపిస్తోందా? ఇక్కడో చిన్న మెలిక ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ నార్త్ థియేట్రికల్ హక్కులతో పాటు ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల డిజిటల్, ఇంటర్నెట్, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న పెన్ మూవీస్ సంస్థలోనే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ అరంగేట్రం జరగబోతోంది.

టాలీవుడ్లోనే ఇంకా హీరోగా నిలదొక్కుకోలేకపోతున్న శ్రీనివాస్‌ను బాలీవుడ్లో హీరోగా పరిచయం చేయడానికి పెన్ సినిమాస్ ముందుకు రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాదిన కొంత పాపులారిటీ తెచ్చుకున్న శ్రీనివాస్‌ ‘ఛత్రపతి’ రీమేక్‌తో హిందీలో పరిచయం కానున్న సంగతి తెలసిిందే. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు.

బాలీవుడ్లో పెన్ మూవీస్‌కు మంచి పేరే ఉంది. ఆ సంస్థ పెద్ద సినిమాలే ప్రొడ్యూస్ చేసింది. కానీ యశ్ రాజ్ ఫిలిమ్స్, ధర్మ ప్రొడక్షన్స్ లాగా మరీ పాపులర్ అయితే కాదు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హక్కులు దక్కించుకున్న సంస్థగా దాని పేరు మార్మోగడం ఖాయం. ఈ సినిమా రిలీజయ్యే వరకు ఆ సంస్థ మీడియాలో వార్తల్లో ఉంటుంది. ఈ సినిమాతో ఆ సంస్థ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఇలాంటి ప్రొడక్షన్ హౌస్‌ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తోందంటే.. ఆ తర్వాత మీడియా అటెన్షన్ బాగా ఉంటుంది. ఆ రకంగా తనకు కలిసొస్తుందని బెల్లంకొండ శ్రీనివాస్ సంతోషిస్తుండొచ్చు.

ఐతే ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన కథానాయికగా చేయడానికే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లు ముందుకు రాకపోవడం ఇబ్బంది కలిగించేదే. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలోనూ కొంత ఆలస్యం జరుగుతోంది. వచ్చే ఏడాది ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.