ఈ రోజుల్లో ఒక సినిమా ఆడాలంటే చాలా విషయాలు కలిసి రావాలి. ప్రతి వారం రెండు మూడు సినిమాలకు తక్కువ కాకుండా రిలీజవుతున్నాయి. ముందు వారాల్లో బాగా ఆడుతున్న సినిమాలు ఉంటున్నాయి. తర్వాతి వారానికి సినిమాలు రెడీగా ఉంటాయి. ఇంత పోటీని తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేయడం చిన్న విషయం కాదు.
పోటీలో ఉన్న సినిమాలన్నింటికంటే మెరుగైన టాక్ తెచ్చుకోవడం.. యూత్, ఫ్యామిలీస్‌ను ఆకర్షించడం కీలకం. ఈ విషయాల్లో ఏది సక్సెస్ అయితే దానికి ప్రేక్షకులు పట్టం కట్టేస్తున్నారు. అంచనాలను మించి వసూళ్లు అందిస్తున్నారు. క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలకు ఇలాగే పరిస్థితులు కలిసొచ్చాయి. ఈ వారం ‘రంగ్ దే’ ఆ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. మరీ ప్రత్యేకమైన సినిమా కాదు. ఇందులో కొత్త విషయాలేమీ లేవు.
కానీ ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచే అంశాలు ‘రంగ్ దే’లో ఉన్నాయి. అందమైన లీడ్ పెయిర్, వాటి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయింది. యూత్, ఫ్యామిలీస్ కోరుకునే అంశాలు ఇందులో ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ పెద్ద ప్లస్. ఒక అందమైన ప్యాకేజీలా ఈ సినిమా తయారైంది. సినిమా చూసిన ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి కలగకపోయినా రిగ్రెట్ అయ్యే పరిస్థితి లేదు.
వీకెండ్లో థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఈ మాత్రం చాలు. దీంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్లో ఈ సినిమా బాక్సాఫీస్ లీడర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి పోటీగా శుక్రవారం వచ్చిన ‘అరణ్య’కు టాక్ బాగా లేదు. పైగా అది సీరియస్ సినిమా. శనివారం రిలీజైన ‘తెల్లవారితే గురువారం’కు కూడా మంచి టాక్ రాలేదు. గత రెండు వారాల్లో బాక్సాఫీస్‌ను డామినేట్ చేసిన ‘జాతిరత్నాలు’ కూడా స్లో అయింది. ఈ నేపథ్యంలో వారం పాటు వసూళ్లు దున్నుకోవడానికి నితిన్ సినిమాకు మంచి స్కోప్ ఉన్నట్లే.