తరుణ్, ఉదయ్ కిరణ్‌లు ఫేడవుట్ అయిపోయాక టాలీవుడ్లో ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ.. లవర్ బాయ్ అనే ట్యాగ్ తెచ్చుకున్న హీరో ఎవరు అంటే మరో మాట లేకుండా అక్కినేని నాగచైతన్య పేరు చెప్పేయొచ్చు. తొలి సినిమా జోష్ ఫెయిలయ్యాక ఏమాయ చేసావె లాంటి క్లాస్ లవ్ స్టోరీతో ఫస్ట్ హిట్ కొట్టిన అతను.. ప్రేమకథను ప్రయత్నించిన ప్రతిసారీ మంచి ఫలితమే అందుకున్నాడు.
100 పర్సంట్ లవ్, రారండోయ్ వేడుక చూద్దాం, మజిలీ లాంటి పెద్ద హిట్లు ప్రేమకథలతోనే వచ్చాయి చైతూకి. లవ్ స్టోరీల్ని విడిచిపెట్టి వేరే జానర్లు ప్రయత్నించిన ప్రతిసారీ అతడికి తిరస్కారమే ఎదురైంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు అతడికి అస్సలు కలిసి రాలేదు. ఐతే ఈసారి ప్రేమకథ కాకుండా, యాక్షన్ జోలికి వెళ్లకుండా ఓ భిన్నమైన జానర్‌ను చైతూ ట్రై చేయబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చేస్తన్న చైతూ.. దీని తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించే ఈ సినిమా కోసం విక్రమ్, చైతూ హార్రర్ థ్రిల్లర్ జానర్లోకి వెళ్లనున్నారట. మరో దర్శకుడితో కలిసి ఇష్టం సినిమా తీసిన విక్రమ్‌కు సోలో డైరక్టర్‌గా బ్రేక్ ఇచ్చిన చిత్రం 13 బి. ఆ హార్రర్ థ్రిల్లర్ అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. కానీ తర్వాత ఆశ్చర్యకరంగా విక్రమ్ లవ్ స్టోరీల వైపు మళ్లాడు.
తర్వాత హలో లాంటి యాక్షన్ టచ్ ఉన్న సినిమా చేశాడు. చివరగా విక్రమ్ నుంచి వచ్చిన గ్యాంగ్ లీడర్ కామెడీ టచ్ ఉన్న థ్రిల్లర్. ఈసారి అతను 13బి తరహా హార్రర్ థ్రిల్లర్ చేయబోతున్నాడని.. చైతూను కొత్తగా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై అధికార ప్రకటన రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates