ఒకప్పుడైతే అటవీ నేపథ్యంలో తరచుగా సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు కనీసం పల్లెటూళ్ల నేపథ్యంలో సినిమాలు తీయడం కూడా తగ్గిపోయింది. ఇక అడవుల సంగతేం చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఈ లోటు బాగా కనిపిస్తుంది. ఒకప్పుడు అడవి దొంగ, అడవి రాముడు, బొబ్బిలి రాజా.. ఇలా అడవి నేపథ్యంలో తెరకెక్కి బ్లాక్‌బస్టర్లు అయిన చాలా సినిమాలున్నాయి. గత రెండు దశాబ్దాల్లో మాత్రం ఈ తరహా సినిమాలు బాగా అరుదైపోయాయి.
ఇలాంటి తరుణంలో రానా దగ్గుబాటి పూర్తిగా అటవీ నేపథ్యంలో ఓ సినిమా చేశాడు. అదే.. అరణ్య. ఏనుగులు-ప్రకృతి-జీవ వైవిధ్యం.. ఈ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ చిత్రం కోసం రానా చాలానే కష్టపడ్డాడు. ‘బాహుబలి’కి మించి ఈ సినిమాకే ఎక్కువ శ్రమించానని రానా చెప్పాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. థాయ్‌లాండ్‌లోని అడవుల్లో పదుల సంఖ్యలో ఏనుగుల మధ్య ఈ సినిమా చిత్రీకరణ జరిపినట్లు అతను వెల్లడించాడు.
ఏనుగుల మధ్య షూటింగ్ చేయడం చాలా భయం వేసిందని, అసలు ఈ సినిమా కోసం సన్నద్ధం కావడమే చాలా కష్టమైందని రానా తెలిపాడు. శిక్షకుల ఆధ్వర్యంలో థాయ్‌లాండ్‌లో 15 రోజుల పాటు ఏనుగుల మధ్య గడిపి వాటిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించినట్లు రానా వెల్లడించాడు. తొలి నాలుగు రోజులు చాలా భయం వేసిందని.. తర్వాత వాటికి అలవాటు పడ్డానని రానా తెలిపాడు. తనకు ఏనుగులు అలవాటు పడ్డప్పటికీ.. అవి ఎప్పుడైనా అదుపు తప్పుతాయేమో అన్న భయం ఉండేదని, అందుకే జేబులో ఎప్పుడూ అరటిపండు, బెల్లం ముక్క పెట్టుకుని తిరుగుతుండేవాడినని రానా తెలిపాడు.
ఐతే ఒక రోజు తన జేబులో ఉన్న అరటిపండు కొంచెం బయటికి కనిపించిందని.. దీంతో తన దగ్గర చాలా అరటిపళ్లు ఉన్నాయేమో అనుకుని ఒక్కసారిగా ఏనుగులన్నీ తన వైపు దూసుకొచ్చాయని.. అప్పుడు వణికిపోయానని.. సమయానికి శిక్షకులు వచ్చి వాటిని అదుపు చేశారని రానా తెలిపాడు. ఎంతో కష్టపడి, మంచి ఉద్దేశంతో తీసిన ‘అరణ్య’ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని రానా ధీమా వ్యక్తం చేశాడు. ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.