జాతీయ అవార్డులపై విమర్శలు

2019 సంవత్సరానికి జాతీయ సినిమా పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గత ఏడాదే ఈ అవార్డులను ప్రకటించాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా తప్పలేదు. ప్రతిసారీ అవార్డులు వెల్లడించినపుడు కొన్ని అసంతృప్త స్వరాలు వినిపించడం మామూలే. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. కాకపోతే ఈసారి అవార్డులపై మరింతగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎక్కువమంది అభ్యంతర పెడుతున్నది ఉత్తమ సంగీత దర్శకుడిగా తమిళుడైన డి.ఇమాన్‌ను ఎంపిక చేయడం గురించే. అతను మంచి అభిరుచి ఉన్న సంగీత దర్శకుడే. ‘కుంకి’ (తెలుగులో గజరాజు) లాంటి సినిమాలు చూస్తే ఇమాన్ ప్రతిభ ఏంటో అర్థమవుతుంది. ఐతే అలాంటి సినిమాకు కాకుండా ‘విశ్వాసం’ అనే మాస్ మసాలా సినిమాకు ఇమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో సంగీత పరంగా ఏం ప్రత్యేకత ఉందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.

‘విశ్వాసం’ పూర్తిగా ఒక మసాలా సినిమా. అందులో పాటలు, నేపథ్య సంగీతం రొటీన్‌గానే ఉంటాయి. ఓవైపు తెలుగులో ‘జెర్సీ’ సినిమాకు అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించాడు. మరోవైపు ‘అసురన్’లో జీవీ ప్రకాష్ కుమార్ అదరగొట్టాడు. ఇలాంటి సినిమాలను పక్కన పెట్టి ‘విశ్వాసం’ లాంటి రొటీన్ సినిమాకు ఇమాన్‌ను ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడం చాలామందికి రుచించడం లేదు.

ఇక కంగనా రనౌత్‌ను ఉత్తమ నటిగా ఎంపిక చేయడం పట్ల కూడా ఓ వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది. మోడీ సర్కారుకు భజన చేయడం వల్లే ఆమెకు అవార్డు ఇచ్చారంటున్నారు. మణికర్ణిక, పంగా సినిమాల్లో ఆమె బాగానే చేసినప్పటికీ.. ప్రాంతీయ చిత్రాల్లో ఎంతోమంది హీరోయిన్లు గొప్ప నటన కనబరిచారని, వారిని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.

‘సూపర్ 30’కి గాను హృతిక్ రోషన్‌కు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వకపోవడంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధనుష్, మనోజ్ బాజ్‌పేయి అవార్డులకు అర్హులే అయినప్పటికీ.. హృతిక్ నటన వారికి ఎంతమాత్రం తక్కువ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మన సినిమాను తక్కువ చేసుకోవడం కాదు కానీ.. ‘మహర్షి’కి రెండు జాతీయ అవార్డులు దక్కడం మీదా మన వాళ్ల నుంచే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘మిషన్ మంగళ్’ లాంటి సినిమాలకు హోల్ సమ్ ఎంటర్టైనర్ అవార్డు దక్కాల్సిందని.. అలాగే బెస్ట్ కొరియోగ్రఫీ ఇచ్చేంతగా ‘మహర్షి’ డ్యాన్సుల్లో ప్రత్యేకత ఏముందని ప్రశ్నిస్తున్నారు. కార్తి నటించిన ‘ఖైదీ’కి అవార్డులే రాకపోవడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)