ఈ హీరోయిన్ల సుడి మామూలుగా లేదు

తొలి సినిమా సక్సెస్ అయితే హీరోయిన్ల దశ మారిపోవడం మామూలే. కానీ తొలి చిత్రం ఇంకా విడుదల కాకముందే ఆఫర్లు రావడం, హీరోయిన్ బిజీ అయిపోవడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. ‘ఉప్పెన’తో కథానాయికగా పరిచయం అయిన కృతి శెట్టి విషయంలో ఇదే జరిగింది. గత ఏడాది ఏప్రిల్లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా రిలీజ్ కాకముందే కృతి గురించి ఇండస్ట్రీలో చర్చ నడిచింది.

ప్రోమోల్లో విపరీతంగా ఆకట్టుకున్న కృతి మీద నిర్మాతలు, దర్శకులు కన్నేశారు. ఆమెకు అడ్వాన్సులు ఇచ్చేశారు. నాని సినిమా ‘శ్యామ్ సింగరాయ్’తో పాటు సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణల చిత్రంలోనూ ఈమె కథానాయికగా ఎంపికైంది. ‘ఉప్పెన’ రిలీజ్ కావడానికి ముందే ఈ ప్రాజెక్టులకు కృతి ఓకే అయిపోవడం విశేషం. ఐతే ‘ఉప్పెన’కు వచ్చిన హైప్ వేరు. దాని ప్రోమోలు బాగా హైలైట్ అయ్యాయి కాబట్టి కృతికి అవకాశాలు వచ్చాయనుకోవచ్చు.

కానీ సుశాంత్ హీరోగా నటిస్తున్న ‘ఇచట వాహనములు నిలపరాదు’ సినిమాతో కథానాయికగా పరిచయం కానున్న మీనాక్షి చౌదరి సైతం కృతి తరహాలోనే తొలి చిత్రం విడుదలకు ముందే మంచి ఆఫర్లు పట్టేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ సినిమా టీజర్ కూడా ఆకట్టుకుంది కానీ.. ‘ఉప్పెన’ స్థాయిలో దీనికి హైప్ ఏమీ లేదు. పైగా హీరోయిన్ గురించి పెద్ద చర్చ కూడా లేదు. కానీ ఆ చిత్రం విడుదల కావడానికి ముందే రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో మీనాక్షి ఛాన్సులు పట్టేసింది.

ఇప్పటికే రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’లో ఓ కథానాయికగా ఎంపికైన మీనాక్షి.. ఇప్పుడు నాని నిర్మాణంలో అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను రూపొదించనున్న ‘హిట్-2’కి కూడా హీరోయిన్‌గా ఓకే అయింది. శనివారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. మీనాక్షి 2018లో మిస్ ఇండియా కావడం విశేషం. ఐతే అందాల పోటీల్లో గెలిచిన అమ్మాయిల చూపు బాలీవుడ్ మీద ఉంటుంది కానీ.. మీనాక్షి మాత్రం తెలుగులో ఓ చిన్న సినిమాతో తన ప్రస్థానాన్ని ఆరంభించింది. కానీ ఆ సినిమా విడుదల కాకముందే రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలందుకుని ఆశ్చర్యపరుస్తోంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)