ఆడ రత్నం పట్టేసింది పెద్ద ఛాన్స్

ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ‘జాతిరత్నాలు’ గురించే చర్చంతా. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది. హీరో నవీన్ పొలిశెట్టి అయితే ఈ సినిమాతో మంచి మార్కెట్ తెచ్చుకుని మంచి స్థాయికి వెళ్లేట్లే కనిపిస్తున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు ఇంకా డిమాండ్ పెరిగేలా ఉంది. ఈ చిత్రంతోనే కథానాయికగా పరిచయం అయిన ఫారియా అబ్దుల్లాకు సైతం చాలా మంచి పేరే వచ్చింది. కాకపోతే ట్రెడిషనల్ గ్లామర్ హీరోయిన్ల లాగా కాకుండా టిపికల్‌గా కనిపించే ఈ అమ్మాయికి కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు దక్కుతాయా.. ఆమెను గ్లామర్ తారగా చూడ్డానికి జనాలు ఇష్టపడతారా అన్నదే కొంచెం సందేహంగా ఉంది. కానీ టాలీవుడ్ ఫిలిం మేకర్స్ అలా ఏమీ ఆలోచిస్తున్నట్లు లేరు. ఆమెకు ఒక పెద్ద స్టార్ సరసన ఓ కమర్షియల్ సినిమాలోనే కథానాయికగా అవకాశం దక్కడం విశేషం.

తన రెండో సినిమాలో మాస్ రాజా రవితేజతో రొమాన్స్ చేయబోతోంది ఫారియా అబ్దుల్లా. ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్న రవితేజ.. దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఖరారయ్యారు. తమిళ అమ్మాయి ఐశ్వర్యా మీనన్‌తో పాటు కన్నడ భామ శ్రీలీలను కథానాయికలుగా ఎంపిక చేశారు. అంతటితో హీరోయిన్ల సంగతి ఓకే అయినట్లే అనుకున్నారు. కానీ ఈ చిత్రంలో ఫారియా సైతం ఒక పాత్రకు ఎంపిక కావడం విశేషం. అదేమీ స్పెషల్ రోల్ కూడా కాదు. రవితేజకు జోడీగానే ఆమె కూడా నటించబోతున్నట్లు చెబుతున్నారు. మరి ముగ్గురు హీరోయిన్లకు ఈ సినిమాలో ఎంత స్కోప్ ఉంటుందో.. ఫారియా ఏమాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటుందో చూడాలి. తొలి చిత్రంలో ఒక మామూలు అమ్మాయిలా కనిపించిన ఫారియా.. ఈ చిత్రంలో గ్లామరస్‌గా కనిపించి తనలో కొత్త కోణాన్ని చూపిస్తుందేమో చూడాలి.