‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైన కొంత కాలానికే.. దీని స్ఫూర్తితో ఒక వెబ్ సిరీస్ తీయాలని నెట్ ఫ్లిక్స్ వాళ్లు సన్నాహాలు చేయడం తెలిసిందే. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజయ్యాక ఆ ప్రయత్నాలు మరింత జోరందుకున్నాయి. టాలీవుడ్ దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారుల దర్శకత్వంలో ఆ సిరీస్ తీసేందుకు రూ.100 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఈ సిరీస్ కోసం పూర్వ నిర్మాణ పనులు జోరుగానే సాగాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
తీరా చూస్తే ఈ ఇద్దరు దర్శకుల వర్క్ నెట్ ఫ్లిక్స్ వాళ్లకు నచ్చలేదు. దీంతో ఆ సిరీస్‌ను పక్కన పెట్టేశారు. ప్రవీణ్, దేవా ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. ఇక ఈ సిరీస్ అటకెక్కినట్లే అని అంతా అనుకున్నారు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ ప్రాజెక్టును విడిచి పెట్టడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు మరింత భారీగా ఈ సిరీస్ తీయడానికి రంగం సిద్ధం చేసినట్లు తాజా సమాచారం.
ముందు అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు.. అంటే రూ.200 కోట్లతో ‘బాహుబలి’ సిరీస్ తీయడానికి నెట్ ఫ్లిక్స్ నిర్ణయించింది. రాజమౌళి పర్యవేక్షణలోనే ఈ సిరీస్ తెరకెక్కనుంది. బాలీవుడ్ నుంచి వేరే ఫిలిం మేకర్స్‌ను ఈ సిరీస్ కోసం ఎంచుకున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’లో మనం చూసే కథ కంటే ముందు జరిగే వ్యవహారంతో ఈ సిరీస్ నడుస్తుందట. ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది.
హాలీవుడ్లో వచ్చిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ఇండియన్ వెర్షన్ లాగా భారీ స్థాయిలో ఈ సిరీస్ తీయడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. తొమ్మిది ఎపిసోడ్లతో తొలి సీజన్ రిలీజ్ చేస్తారట. ఇండియాలో తెరకెక్కనున్న అతి పెద్ద వెబ్ సిరీస్ ఇదే అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ సిరీస్ దర్శకులెవరు.. ప్రధాన పాత్రలు పోషించేది ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సిరీస్ గురించి అన్ని వివరాలు వెల్లడవుతాయి.