‘ఆర్ఆర్ఆర్’లో సీత పాత్రలో నటిస్తోంది బాలీవుడ్ భామ ఆలియా భట్. సోమవారం ఆలియా పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ముందు రోజు రాముడి విగ్రహం ముందు కూర్చున్నట్లుగా ఆమె ప్రి లుక్ కూడా వదిలారు. ఐతే సీత పేరు పెట్టుకుని, రాముడి విగ్రహం ముందు కూర్చుంటే.. ఆమె రాముడి సతీమణి సీతాదేవి అయిపోతుందా అన్న ఇంగిత జ్ఞానం లేకుండా నార్త్ ఇండియన్స్ చేస్తున్న అతి ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
‘ఆర్ఆర్ఆర్’లో ఆమె చేస్తున్నది సీతా మాత పాత్ర అనుకుని వాళ్లు చేస్తున్న ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ఆలియాకు సీతా మాత పాత్ర చేసే అర్హత లేదట.. తన పాత్రను పరిచయం చేస్తూ ‘సీతా మాత అని కాకుండా జస్ట్ ‘సీత’ అని కామెంట్ పెట్టడం తప్పట. ఇందుకుగాను ‘ఆర్ఆర్ఆర్’ను బాయ్‌కాట్ చేయాలట. ఉత్తరాదికి చెందిన ఒక జర్నలిస్టు సైతం ‘ఆర్ఆర్ఆర్’ను బాయ్‌కాట్ చేసే అవకాశాలున్నట్లు ఒక ట్వీట్ పెట్టడం గమనార్హం.
ఇంకా ఎంతోమంది నార్త్ ఇండియన్స్ ఆలియా ‘ఆర్ఆర్ఆర్’లో సీత పాత్ర చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి బాలీవుడ్లో నెపోటిజం బ్యాచ్‌కు సోషల్ మీడియాలో వ్యతిరేకత తప్పట్లేదు. ఈ బ్యాచ్‌లో ప్రధానంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్లలో ఆలియా ఒకరు. ఆమె ఏం చేసినా తప్పే అన్నట్లు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’లో సీత పాత్ర పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ పాత్ర పేరు సీత తప్ప, ఆమె చేస్తున్నది దేవత అయిన సీతా దేవి పాత్ర కాదు అనే కనీస జ్ఞానం వారికి లేకపోతోంది. అల్లూరి సీతారామరాజు భార్య పేరు సీత అని.. ఆమె పేరు కలిసొచ్చేలాగే రామరాజు అనే అతడి పేరుకు సీత యాడ్ అయిందని వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. దక్షిణాదికి చెందిన గొప్ప వాళ్ల గురించి నార్త్ వాళ్ల దగ్గర కనీస సమాచారం ఎప్పుడూ ఉండదు. ఇక్కడి చరిత్రపై అవగాహన ఉండదు. ఈ అజ్ఞానంతోనే ఆలియా చేస్తున్న పాత్ర గురించి ఏమీ తెలియకుండా ట్వీట్లు వేస్తూ అబాసుపాలవుతున్నారు.