మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ఒకటి. చిరు టాప్ ఫాంలో ఉండగా చేసిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయింది. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాక.. సరిగ్గా ఏడాదికి ‘గ్యాంగ్ లీడర్’తో పలకరించిన చిరు.. తన అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులనూ ఉర్రూతలూగించాడు.
రాజారాం పాత్రలో చిరు స్క్రీన్ ప్రెజెన్స్, నటన, డ్యాన్సులు, ఫైట్లు.. ఇలా ప్రతిదీ అభిమానుల్ని అలరించాయి. విజయ బాపినీడు స్టైలిష్ మేకింగ్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. బలమైన కథ, ఆసక్తికర కథనం సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఐతే విజయ బాపినీడు ముందుగా ‘గ్యాంగ్ లీడర్’ కథ చెబితే చిరు చేయనన్నాడట. ఐతే తర్వాత పరుచూరి సోదరులతో ఈ కథ గురించి డిస్కస్ చేశాడట విజయబాపినీడు.
ముందు విజయ బాపినీడు రాసుకున్న కథ ప్రకారం హీరో అన్నతో పాటు అతడి స్నేహితులందరూ కూడా చనిపోతారట. ఇది విన్న పరుచూరి సోదరులు.. అందరూ ఒకేసారి చనిపోతే ఏం బాగుంటుంది, పైగా గ్యాంగ్ లేకుండా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు అర్థమేముంది అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా చెప్పి కథలో ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. తర్వాత చిరుకు కథ వినిపిస్తే ఆయనకు నచ్చిందట.
అప్పుడు అల్లు అరవింద్‌ను రంగంలోకి దించారు చిరు. ఆయన పరుచూరి సోదరుల ద్వారా కథ విన్నారు. కథ వింటూ ఆయన టేప్ రికార్డర్లో కథను రికార్డ్ చేసుకున్నారు. ఇదెందుకు అని అడిగితే మీరు మాటలతో మాయ చేస్తారు, కాబట్టి కథ రికార్డ్ చేసుకుని ఇంటికెళ్లి మరోసారి తీరిగ్గా విని నిర్ణయం చెబుతా అన్నారట. అలా ఇంటికెళ్లి కథ విని అరవింద్ పచ్చజెండా ఊపాక ఈ సినిమా పట్టాలెక్కింది. 1991 మే 9న రిలీజైన ‘గ్యాంగ్ లీడర్’ పాత రికార్డులన్నీ చెరిపేస్తూ కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.