‘గాలి సంపత్’ నిర్మాతలు హ్యాపీ!

ఈ గురువారం మహాశివరాత్రి కానుకగా వచ్చిన మూడు చిత్రాల్లో ‘గాలి సంపత్’ ఒకటి. మిగతా రెండు చిత్రాలు ‘జాతి రత్నాలు’; ‘శ్రీకారం’లతో పోలిస్తే దీనికి టాక్ యావరేజ్‌గా వచ్చింది. వసూళ్లు కూడా ఓ మోస్తరుగా ఉన్నాయి. వీకెండ్ అయ్యాక ఈ సినిమా ఫలితమేంటో తెలుస్తుంది. ఐతే ఈ చిత్ర నిర్మాతలు విడుదలకు ముందే సేఫ్ జోన్లోకి వచ్చేయడం విశేషం. తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్లో ఈ సినిమాను పూర్తి చేసేయడం నిర్మాతలకు కలిసొచ్చింది.

అనిల్ రావిపూడి బ్రాండ్ ఈ చిత్రానికి బాగానే కలిసొచ్చి బిజినెస్ అంచనాలకు మించి జరిగింది. పెట్టుబడి మీద మంచి లాభానికే సినిమాను అమ్ముకున్నారు. కొన్ని నెలల కిందట సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడంతోనే ఈ చిత్ర ప్రమోషన్లు కూడా మొదలైపోయాయి. మొదట్నుంచి సినిమాను వార్తల్లో నిలబెడుతూ వచ్చారు. ఫీఫీఫీ పాట సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. టీజర్, ట్రైలర్ సైతం ఆకట్టుకున్నాయి. దీంతో విడుదల ముంగిట ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది.

దిల్ రాజు సపోర్ట్ కూడా ఉండటంతో వేరే రెండు చిత్రాల పోటీ మధ్య ఈ సినిమాకు మంచి రిలీజే దక్కింది. ఓపెనింగ్స్ ఓ మోస్తరుగా వచ్చాయి. లాంగ్ వీకెండ్‌ను ఉపయోగించుకుని ఈ వసూళ్లతోనే సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులేస్తోంది. సినిమాలో మంచి కథ ఉన్నప్పటికీ.. కథనం ఇంకొంచెం మెరుగ్గా ఉండాల్సిందన్న అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమైంది.

ఐతే రాజేంద్ర ప్రసాద్ పాత్ర, పెర్ఫామెన్స్ ప్రేక్షకులను మెప్పిస్తుండటం సినిమాకు కలిసొచ్చే అంశం. బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన పోటీ ఉండటం సినిమాకు కొంచెం నెగెటివ్ అవుతోంది. కానీ సినిమాకు డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా మంచి ఆదాయమే లభించే అవకాశముంది. ఓవరాల్‌గా చూస్తే నిర్మాతల పెట్టుబడికి మంచి లాభమే అందించినట్లే ఉంది ‘గాలి సంపత్’.