తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ జననాథన్ ఆదివారం ఉదయం మరణించాడు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జననాథన్.. పదిన్నర ప్రాంతంలో తుది శ్వాస విడిచాడు. 61 ఏళ్ల జననాథన్ మూడు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
జననాథన్ చేసింది తక్కువ సినిమాలే కానీ.. రచయితగా, దర్శకుడిగా ఆయనకు మంచి పేరే ఉంది. ఆయన రూపొందించిన ‘ఇయర్కై’ సినిమాకు 2003లో ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు దక్కింది. జీవా హీరోగా జననాథన్ రూపొందించిన ‘ఈ’ గొప్ప ప్రయోగంగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాభం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషించారు.
‘లాభం’ అతి త్వరలోనే విడుదల కాబోతోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న సమయంలోనే జననాథన్ చనిపోయారు. లాక్ డౌన్‌కు ముందే చాలా వరకు పూర్తయిన ‘లాభం’ సినిమాను ఈ మధ్యే పూర్తి చేశారు జననాథన్. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. కొన్ని రోజులుగా జననాథన్ రేయింబవళ్లు ఈ సినిమా ఎడిటింగ్ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
గురువారం ఉదయం జననాథన్ ఎడిటింగ్ పనులను పర్యవేక్షించి భోజనం కోసం ఇంటికి వెళ్లారు. తర్వాత తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. ఆయన కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు వెళ్లగా.. ఆయన స్పృహ లేకుండా పడి ఉండటం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రికి వచ్చేసరికే మెదడులో రక్తం గడ్డ కట్టి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా తెలుస్తోంది. మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఈ వార్త తమిళ సినీ జనాలందరినీ విషాదంలో ముంచెత్తింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates