పుష్ఫ టైటిల్.. బ‌న్నీ అప్పుడే రివీల్ చేశాడు

అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెరెకెక్క‌తున్న కొత్త చిత్రానికి పుష్ప అనే టైటిల్ ఖ‌రార‌రైన‌ట్లు రెండు రోజుల ముందే వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల్ని నిజం చేస్తూ ఈ రోజు అధికారికంగా అదే టైటిల్‌ను అనౌన్స్ చేశారు. హీరో పేరును పుష్ప‌రాజ్‌గా ఖ‌రారు చేసిన‌ప్ప‌టి నుంచి సుక్కు మ‌దిలో ఈ టైటిలే ఉంద‌ట‌. ఈ సినిమా క‌థ చిత్తూరు జిల్లా నేప‌థ్యంలో సాగుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ పుష్ప‌రాజ్, పుష్ప‌కుమార్ అనే పేర్లు బాగానే పాపుల‌ర్. కాబ‌ట్టి హీరో పాత్ర‌కు పుష్ప‌రాజ్ అని పేరు పెట్టి.. వాడుకలో షార్ట్‌గా హీరోను పిలిచే పుష్ప అనే మాట‌నే టైటిల్‌గా పెట్టేశారు. ఇప్పుడు కొంచెం మిశ్ర‌మ స్పంద‌న ఉన్నా.. త‌ర్వాత జ‌నాల‌కు ఈ టైటిల్ అల‌వాటైపోతుంద‌నే అనుకుంటున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఈ టైటిల్‌ను అల్లు అర్జున్ నాలుగు నెల‌ల కింద‌టే రివీల్ చేయ‌డం విశేషం. సుకుమార్‌తో త‌న కొత్త సినిమాను ఖ‌రారు చేస్తూ ఆయ‌న‌తో దిగిన ఫొటోను గ‌త ఏడాది న‌వంబ‌రు 27న బ‌న్నీ ట్విట్ట‌ర్లో షేర్ చేశాడు. ఆ ఫొటోను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ.. సుక్కు జుట్టు రంగు మారిందని, త‌న ఒంటి రంగు మారింద‌ని.. కానీ త‌మ మ‌ధ్య ప్రేమ‌, తామిద్ద‌రం క‌లిస్తే వ‌చ్చే వెర్రిలో మాత్రం మార్పు లేద‌ని.. అదేంటో త్వ‌ర‌లో చూస్తార‌ని చెబుతూ.. చివ‌ర్లో కొన్ని సింబ‌ల్స్ పెట్టాడు బ‌న్నీ. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే ఆ సింబ‌ల్స్‌లోనే pushpa అనే అక్ష‌రాలున్నాయి. మ‌రి అప్ప‌టికి త‌న పాత్ర పేరును అలా రివీల్ చేశాడా.. లేక అప్ప‌టికే టైటిల్ కూడా ఖ‌రారైపోయిందా అన్న‌ది తెలియ‌దు కానీ.. బ‌న్నీ అయితే ముందే సంకేతాలు ఇచ్చేసినా ఎవ్వ‌రూ దాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే.