తెలుగు ప్రేక్షకులపై ముంబయిలో రౌడీ గొడవ

తెలుగు ప్రేక్షకుల సినీ అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కరోనా విరామానంతరం మనవాళ్ల సినిమా ప్రేమ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దేశంలోని మిగతా ఫిలిం ఇండస్ట్రీలు కరోనా ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. కానీ టాలీవుడ్ మాత్రం గొప్పగా పుంజుకుని సాధారణ స్థితికి, ఇంకా చెప్పాలంటే కరోనా ముందు కంటే మంచి స్థితికి చేరుకుంది. ఇదంతా తెలుగు ప్రేక్షకులకు సినిమా మీద ఉన్న ప్రేమ వల్లే సాధ్యమైంది. అందుకే ఈ మధ్య ఏ సినీ వేడుక జరిగినా.. అందులో పాల్గొనే ముఖ్య వ్యక్తులు మన ప్రేక్షకులను ఆకాశానికెత్తేస్తున్నారు.

ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి సైతం ‘ఉప్పెన’ వేడుకలో దీని గురించి మాట్లాడారు. ‘వైల్డ్ డాగ్’ ప్రెస్ మీట్లో నాగార్జున కూడా ఈ విషయమై ఉద్వేగానికి లోనయ్యారు. తాజాగా యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.. ‘జాతిరత్నాలు’ ప్రిలీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు ప్రేక్షకులను ఆకాశానికెత్తేస్తూ వారి సినీ ప్రేమను కొనియాడాడు.

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలుగు సినిమా వెలిగిపోతోందంటే.. అందుకు మన ప్రేక్షకులు చూపిస్తున్న ప్రత్యేక ప్రేమే కారణమని విజయ్ అన్నాడు. దర్శకుడు ఒక కథ చెప్పి నిర్మాతను, హీరోను మెప్పించి ఆ సినిమా మొదలైందంటే.. దాని ద్వారా కొన్ని వేల మంది ఉపాధి పొందుతారని.. కానీ ఇంతమందీ బతకడం ప్రేక్షకులు చూపించే ప్రేమ మీదే ఆధారపడి ఉంటుందని విజయ్ అన్నాడు. కరోనా మహమ్మారి తర్వాత భవిష్యత్తు ఏమవుతుందో అని అందరిలాగే తామూ చాలా భయపడ్డామని.. కానీ ప్రేక్షకులు చూపించిన ప్రేమతో ఆ భయాలన్నీ తొలగిపోయాయని విజయ్ అన్నాడు.

తాను ‘లైగర్’ షూటింగ్ కోసం ముంబయికి వెళ్లినపుడు.. మన ప్రేక్షకుల గురించి వాళ్లు ఏదోలా మాట్లాడారని.. ‘‘మీ తెలుగు ప్రేక్షకులు మరీ టూమచ్‌ అబ్బా. కరోనా ప్రభావం ఉన్నా ఇలా థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్నారేంటి’’ అన్నారని.. ఐతే మా ఆడియన్స్‌ను ఏమైనా అంటే ఊరుకోనంటూ వాళ్లతో తాను గొడవ పడ్డానని.. వాళ్ల సినిమా ప్రేమ అసాధారణమైందని, వాళ్లు సినిమా లేకుండా ఉండలేరని, అలాగే తమ హీరోలను ఎక్కువ తక్కువ మాట్లాడినా ఊరుకోరని చెప్పినట్లు విజయ్ వెల్లడించాడు. అందుకే పరిశ్రమ తరఫున తాను తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానన్నాడు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)