కొత్త ఏడాదిలో వరుస రిలీజ్‌లతో దూసుకెళ్తోంది టాలీవుడ్. పేరున్న సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. రాబోతున్నాయి. కరోనా షరతులన్నీ పక్కకు వెళ్లిపోవడంతో ఒకప్పట్లా మళ్లీ జోరుగా ప్రి రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. కాస్త పేరున్న ప్రతి సినిమాకూ ఈ ఈవెంట్లు తప్పనిసరి. వచ్చే వారం మహాశివరాత్రి కానుకగా రానున్న శ్రీకారం సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇది శర్వానంద్ లాంటి స్టార్ హీరో నటించిన చిత్రం. పైగా 14 రీల్స్ లాంటి పెద్ద బేనర్లో తెరకెక్కింది.
ఒక ఉదాత్తమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా కూడా కావడంతో ప్రి రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలోనే నిర్వహించడానికి ప్రణాళికలు రచించారు. ఇద్దరు ప్రముఖ వ్యక్తుల్ని ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా పిలుస్తున్నారు. వాళ్లెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్.
ఇద్దరు సినీ, రాజకీయ ఉద్ధండులు రాబోతుండటంతో ఈ వేడుక చర్చనీయాంశంగా మారడం ఖాయం. ఇంతకుముందు కూడా ఒకసారి చిరు-కేటీఆర్ ఒక సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరు కావడం విశేషం. ఆ సినిమానే.. వినయవిధేయ రామ. ఆ వేడుకకు వచ్చి చిరు, చరణ్‌ల గురించి గొప్పగా మాట్లాడాడు కేటీఆర్. ఐతే ఆ సినిమానే ఆశించిన ఫలితాన్నందించలేకపోయింది.
ఇప్పుడు వేరే హీరో సినిమాకు కేటీఆర్‌తో కలిసి ముఖ్య అతిథిగా వస్తున్నాడు చిరు. ఐతే శర్వాను చిరు తన కుటుంబ సభ్యుడిలాగే చూస్తాడు. చరణ్‌తో కలిసి చదువుకోవడం, చిన్నప్పట్నుంచి ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కావడమే అందుక్కారణం. కేటీఆర్ విషయానికిస్తే.. వ్యవసాయం నేపథ్యంలో ఓ ఉదాత్త కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో శ్రీకారం ఈవెంట్‌కు ఆయన రావడానికి అంగీకరించి ఉండొచ్చు. మరోసారి వేదికను పంచుకోనున్న చిరు-కేటీఆర్ ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడతారో చూడాలి.