ఐదేళ్ల తర్వాత రిలీజ్.. బ్లాక్‌బస్టర్ టాక్

తెలుగులో ఈ వారం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సహా ఏడెనిమిది సినిమాల దాకా ఒకే రోజు విడుదలయ్యాయి. వీటిలో ఏది కూడా ప్రేక్షకుల నుంచి పూర్తి ఆమోదం పొందలేదు. ఎక్కువగా జనాలను ఆకర్షించింది, ఓ మాదిరిగా ఓపెనింగ్స్ తెచ్చుకున్నది అంటే.. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీనే. మిగతా చిత్రాలకు ఓపెనింగ్స్ కూడా లేవు. మన సినిమాల సంగతి పక్కన పెడితే.. తమిళంలో కూడా ఈ శుక్రవారం కొన్ని సినిమాలు రిలీజయ్యాయి. కానీ వాటిలో కొన్ని రోజులుగా బాగా జనాల నోళ్లలో నానుతున్నది, విడుదల ముంగిట అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకున్నది, ఇప్పుడు అదిరిపోయే టాక్‌తో దూసుకెళ్తున్నది.. ‘నెంజం మరప్పదిల్లై’ మూవీనే. ఈ సినిమా కోలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసేలాగే ఉంది. ఇది విలక్షణ చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రమిది. ఎస్జే సూర్యతో పాటు రెజీనా కసాండ్రా, నందిత శ్వేత ముఖ్య పాత్రలు పోషించారు.

ఎప్పుడో 2016లో మొదలైన సినిమా ‘నెంజం మరప్పదిల్లై’. మూణ్నాలుగేళ్ల కిందటే ఈ సినిమా పూర్తయినా ఏవో ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ ఆగిపోయింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ శుక్రవారం విడుదలైంది. కొన్ని రోజుల ముందే రిలీజ్ ఖరారైనప్పటికీ.. విడుదల ముంగిట కూడా అడ్డంకులు తప్పలేదు. అతి కష్టం మీద శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సెన్సేషనల్ టాక్ వచ్చింది. ఇలా రిలీజ్ విషయంలో ఆలస్యం జరిగిన సినిమాలు చాలా వరకు తుస్సుమనిపిస్తుంటాయి కానీ.. ‘నెంజం మరప్పదిల్లై’ మాత్రం అలా కాదట.

చాలా ఏళ్ల నుంచి స్థాయికి తగ్గ సినిమా అందించని సెల్వ.. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయినట్లే అంటున్నారు. అతడి నుంచి మళ్లీ ఓ మాస్టర్ పీస్ వచ్చిందని పొగుడుతున్నారు. తమిళంలో వచ్చిన బెస్ట్ డార్క్ థ్రిల్లర్లలో దీన్నొకటిగా చెబుతున్నారు. సైకో పాత్రలో ఎస్.జె.సూర్య నట విశ్వరూపం చూపించాడని.. రెజీనా కెరీర్లోనే ది బెస్ట్ అనదగ్గ క్యారెక్టర్ చేసిందని కొనియాడుతున్నారు. నందిత శ్వేత మీద కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. తన భార్య ఊర్లో లేపుడు పని మనిషిని ముగ్గులోకి దించాలని చూసే ఒక సైకో కథ ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించే అవకాశమున్న ఈ సినిమాను త్వరలోనే తెలుగులోకి కూడా అనువదించే సూచనలు కనిపిస్తున్నాయి.