నెంజం మరప్పుదిల్లై.. కొన్ని రోజుల నుంచి తమిళ సినీ ప్రేక్షకుల చర్చలన్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. 7/జి బృందావన కాలనీ సహా కొన్ని సంచలన చిత్రాలు తీసిన విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రమిది. మూణ్నాలుగేళ్ల కిందటే ఈ సినిమా పూర్తయింది. కానీ నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు ఉన్న గొడవలు, ఇతర సమస్యల వల్ల ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఒక దశలో ఈ చిత్రం అసలు విడుదలే కాదన్న అభిప్రాయానికి వచ్చేశారందరూ. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా కొన్ని రోజుల కిందట ఈ చిత్రాన్ని విడుదలకు ముస్తాబు చేశారు. ఆసక్తికర ప్రోమోలు కూడా వదిలారు.
డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ ఎస్.జె.సూర్య ఇందులో సైకో పాత్రలో నటించాడు. తాజాగా ‘నెంజం మరప్పుదిల్లై’ నుంచి స్నీక్ పీక్ వీడియో ఒకటి వదలగా.. అందులో సూర్య పాత్ర చూసి జనాలు జడుసుకున్నారు. అంత షాకింగ్‌గా అనిపించిందా స్నీక్ పీక్.
‘నెంజం మరప్పుదిల్లై’ విడుదలకు సమయం పెరిగే కొద్దీ అంచనాలు పెరిగిపోతుంటే.. మరోవైపు ఈ సినిమాను ఎప్పట్నుంచో వెంటాడుతున్న వివాదం తిరిగి రాజుకోవడంతో విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. నిర్మాతల్ని ముందు నుంచి అడ్డుకుంటున్న వర్గాలు మళ్లీ గొడవకు దిగాయి. సెటిల్మెంట్ కోసం పట్టుబట్టాయి. రెండు మూడు రోజులుగా ఈ రగడ నడుస్తోంది. ఒక దశలో సినిమా అనుకున్నట్లుగా విడుదలయ్యే అవకాశాలు లేవని కూడా వార్తలొచ్చాయి. కానీ కోలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగి వివాదాన్ని సెటిల్ చేసినట్లున్నారు. గురువారం సాయంత్రం సమస్య పరిష్కారమైనట్లు ఇరు వర్గాల నుంచి ఉమ్మడిగా ప్రకటన వచ్చింది.
తెలుగులో సంక్రాంతికి రిలీజైన ‘క్రాక్’ సినిమాను కూడా ఇలాంటి వివాదమే వెంటాడింది. కానీ ముందు సమస్యను పరిష్కరించుకోలేదు. రిలీజ్ రోజు గొడవ మొదలై సెకండ్ షోలకు కానీ బొమ్మ పడలేదు. కానీ ‘నెంజం మరప్పుదిల్లై’ విషయంలో ముందు రోజే ఇష్యూ సెటిలైపోయింది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెజీనా, నందిత శ్వేత కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను త్వరలోనే తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates