విజయ్‌కి లైన్ చెప్పిన సుకుమార్

వరుసగా బడా స్టార్లతో సినిమాలు చేస్తున్న సుకుమార్.. కొన్ని నెలల కిందట యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. రామ్ చరణ్‌తో నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి, ‘అల వైకుంఠపురములో’తో ఆ రికార్డును బద్లలు కొట్టిన అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్న సుక్కు.. ఈ దశలో విజయ్‌తో సినిమా చేయడానికి రెడీ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

విజయ్ చాలా వేగంగా స్టార్‌గా ఎదిగినప్పటికీ నిలకడగా విజయాలు సాధించలేకపోతున్నాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అతడి జోరుకు బాగానే బ్రేకులేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న ‘లైగర్’ మీద మరీ అంచనాలేమీ లేవు. ఆ సినిమా తర్వాత విజయ్ ఏ స్థితిలో ఉంటాడేమో ఏమో.,. అలాంటి హీరోతో సుక్కు సినిమా చేయడమేంటి అని ఇండస్ట్రీలో చాలామంది కామెంట్లు కూడా చేశారు. కానీ విజయ్ లాంటి మంచి పెర్ఫామర్‌తో ఓ విభిన్నమైన సినిమా తీయాలని సుక్కు భావించినట్లున్నారు.

స్టార్ సినిమాలకు లెక్కలేసుకున్నట్లుగా కాకుండా.. విజయ్‌తో కొత్త తరహా ప్రయత్నం ఏదో చేయాలనే ఉద్దేశంతోనే సుక్కు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సుక్కు సన్నిహిత వర్గాల సమాచారం ఇటీవలే విజయ్‌తో చేయబోయే సినిమాకు సంబంధించి ఒక కథ కూడా అనుకుని.. దాని లైన్ విజయ్‌కు వినిపించడం కూడా జరిగిందట. దానిపై విజయ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇంకా పూర్తి స్క్రిప్టు తయారు చేయాల్సి ఉండగా.. ఈ సినిమా పక్కాగా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న దానిపై సస్పెన్స్ నడుస్తోంది.

‘పుష్ప’ పూర్తి చేసిన వెంటనే విజయ్‌తో సుక్కు ఈ సినిమా చేస్తాడన్న గ్యారెంటీ లేదంటున్నారు. మధ్యలో ఓ పెద్ద స్టార్‌తోనే సినిమా చేయాలని, ఆ తర్వాత విజయ్‌తో సినిమా మొదలుపెట్టొచ్చని చెబుతున్నారు. ఈ సినిమాను ముందు అనుకున్నట్లు కొత్త నిర్మాతతో కాకుండా మైత్రీ బేనర్లోనే చేయాలని కూడా సుక్కు చూస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతుండటం గమనార్హం.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)