ఆర్ఆర్ఆర్‌లో యాక్ష‌న్ మోతే..

రాజ‌మౌళి సినిమా అంటేనే యాక్ష‌న్ ఓ రేంజిలో ఉంటుంది. కెరీర్ ఆరంభం నుంచి అదే వ‌ర‌స‌. ఎమోష‌న్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లి, రోమాలు నిక్క‌బొడుచుకునేలా యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ను తీర్చిదిద్ద‌డంలో జ‌క్క‌న్న సిద్ధ‌హ‌స్తుడు. త‌న‌కు పెద్ద‌గా బ‌డ్జెట్లు ఇవ్వ‌ని రోజుల్లోనే అత‌ను యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ను ఓ రేంజిలో తీశాడు. ఇక భారీ బ‌డ్జెట్ ఉంటే వాటిని ఇంకెంత బాగా తీయ‌గ‌ల‌నో.. మ‌గ‌ధీర ద‌గ్గ‌ర్నుంచి చూపిస్తూనే ఉన్నాడు జ‌క్క‌న్న‌. బాహుబ‌లికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన‌వి యాక్ష‌న్ స‌న్నివేశాలే. బాహుబ‌లిః ది బిగినింగ్‌లో ఫైట్లు చూసి అబ్బుర‌ప‌డ్డ ప్రేక్ష‌కుల‌ను ది కంక్లూజ‌న్‌లో మ‌రింత వినోదాన్నందించాడు రాజ‌మౌళి.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లో యాక్ష‌న్ ఘ‌ట్టాల మీదా ప్రేక్ష‌కులు మ‌రింత అంచ‌నాల‌తో ఉన్నారు. వారిని ఏమాత్రం నిరాశ‌ప‌రిచేలా లేడు ద‌ర్శ‌క ధీరుడు. బాహుబ‌లిలో ఎక్కువ‌గా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తీర్చిదిద్దింది పీట‌ర్ హెయిన్‌. కొంద‌రు విదేశీ నిపుణులు కూడా అందులో భాగ‌స్వాముల‌య్యారు. ఐతే ఆర్ఆర్ఆర్‌కు వ‌చ్చేస‌రికి పూర్తిగా విదేశీ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ల‌నే పెట్టుకున్నాడు జ‌క్క‌న్న‌.

విదేశాల నుంచి ఒక పెద్ద టీంనే ర‌ప్పించాడు. గ్లాడియేట‌ర్, ది బోర్న్ ఐడెంటిటీ లాంటి ప్ర‌ఖ్యాత చిత్రాల‌కు యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ చేసిన నిక్ పావెల్ ఆర్ఆర్ఆర్‌కు ప‌ని చేస్తుండ‌టం విశేషం. అత‌ను సెట్‌లోకి అడుగు పెట్టి ట్ర‌య‌ల్స్ చేస్తున్న‌, రాజ‌మౌళి నుంచి బ్రీఫింగ్ తీసుకుంటున్న దృశ్యాల‌తో ఒక వీడియోను ఆర్ఆర్ఆర్ టీం ట్విట్ట‌ర్లో షేర్ చేసింది. అత‌డితో పాటు మ‌రికొంద‌రు హాలీవుడ్ నిపుణులు ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు. వాళ్లంతా క‌లిసి దిగిన గ్రూప్ ఫొటో కూడా ట్విట్ట‌ర్లో క‌నిపిస్తోంది. ఇంత‌మంది రంగంలోకి దిగారంటే ఆర్ఆర్ఆర్ యాక్ష‌న్ ఘ‌ట్టాల మోత ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.