సందీప్ కిషన్ పరీక్ష ఆ రోజు

ప్రస్థానం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో కెరీర్ ఆరంభంలో తనపై అంచనాలు పెంచేసిన యువ కథానాయకుడు సందీప్ కిషన్.. ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు అందుకోలేకపోయాడు. బీరువా, టైగర్ లాంటి యావరేజ్ సినిమాలు తప్పితే పెద్ద హిట్ కొట్ట లేకపోయాడు. చివరగా ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అతను ఓ మోస్తరు ఫలితాన్నందుకున్నాడు. తర్వాత వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ ఫ్లాప్ అయింది. అయితే తన గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా సందీప్ సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు. అతడికి ఎప్పుడూ అవకాశాలు ఆగింది లేదు.

ఐతే ఇలా ఎంతో కాలం బండి నడవదు. ఈసారి అతను హిట్టు కొట్టకుంటే కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఖాయం. ఇలాంటి స్థితిలో సందీప్ నుంచి వస్తున్న కొత్త చిత్రం.. ఎ1 ఎక్స్‌ప్రెస్. ఈ సినిమా ఫిబ్రవరి 26నే విడుదల కావాల్సింది. కానీ 19న రావాల్సిన చెక్ 26కు వాయిదా పడటంతో ఈ చిత్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు.

ఐతే మరీ ఆలస్యం చేయకుండా తర్వాతి వారంలో, అంటే మార్చి 5న ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ను విడుదల చేయబోతున్నారు. అధికారికంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అంటే తన కెరీర్లో అతి పెద్ద పరీక్షను మార్చి 5న ఎదుర్కోబోతున్నాడన్నమాట సందీప్. ఈ సినిమాపై సందీప్ చాలా ఆశలతోనే ఉన్నాడు. తమిళంలో విజయవంతమైన ‘అన్బు తునై’ అనే సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిందీ చిత్రం. తమిళంలో సంగీత దర్శకుడు హిప్ హాప్ ఆది హీరోగా నటించడం విశేషం. హాకీ నేపథ్యంలో సాగే ఆ చిత్రం అక్కడ పెద్ద విజయమే సాధించింది.

తెలుగు ట్రైలర్ చూస్తే విషయం ఉన్న సినిమాలాగే అనిపించింది. సినిమాకు మంచి టాక్ వస్తే సందీప్ కెరీర్లో అతి పెద్ద హిట్‌గా నిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. లావణ్య త్రిపాఠి సందీప్‌కు జోడీగా నటించిన ఈ చిత్రాన్ని డెన్నిస్ జీవన్ రూపొందించాడు. మాతృకకు సంగీతాన్నందించిన హిప్ హాప్ ఈ చిత్రానికి కూడా పని చేశాడు. సందీప్ మావయ్య ఛోటా కే నాయుడు ఛాయాగ్రహణం అందించాడు.