టాలీవుడ్‌ను చూసి బాలీవుడ్ కదులుతోంది

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి స్ఫూర్తినిచ్చింది టాలీవుడ్. కరోనా ధాటికి అన్ని పరిశ్రమలూ కుదేలైపోయి మళ్లీ ఎలా పుంజుకోవాలో తెలియక అయోమయానికి గురవుతుంటే.. ఏది ఎలా మొదలుపెట్టాలో.. ఎలా ముందుకు సాగాలో తెలుగు సినీ పరిశ్రమ చూపించింది. దేశంలో లాక్ డౌన్ బ్రేక్ తర్వాత ముందుగా షూటింగ్‌లు మొదలుపెట్టి, కరోనా నిబంధనల మధ్య ఎలా షూటింగ్‌లు చేయాలో చూపించింది టాలీవుడ్డే.

ఈ క్రమంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా టాలీవుడ్ తట్టుకుంది. పరిమితుల మధ్యే ఎలా సినిమాలు పూర్తి చేసుకోవచ్చో చూపించింది. మధ్యలో ఆగినవే కాదు, కొత్తగా మొదలైన సినిమాలు కూడా పూర్తయ్యాయి. థియేటర్లు తెరుచుకోగానే ఆత్రపడకుండా కొంత వేచి చూసి చక్కగా ప్లాన్ చేసి సినిమాలు రిలీజ్ చేశారు టాలీవుడ్ నిర్మాతలు.

50 పర్సంట్ ఆక్యుపెన్సీతోనే భారీ వసూళ్లు తెచ్చుకున్నాయి తెలుగు సినిమాలు. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో క్రేజీ సీజన్లన్నింటికీ కొత్త సినిమాల షెడ్యూళ్లను కూడా ప్రకటించారు. దేశంలో మరే సినీ పరిశ్రమ కూడా టాలీవుడ్‌లా దూకుడు చూపించలేదు.

ఐతే ఇప్పుడు టాలీవుడ్‌ను చూసి బాలీవుడ్ కూడా స్ఫూర్తి పొందుతున్నట్లుంది. కొన్ని నెలలు స్తబ్దుగా ఉండిపోయిన ఆ పరిశ్రమ కూడా నెమ్మదిగా కదులుతోంది. రీస్టార్ట్‌కు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటిదాకా నామమాత్రంగా సినిమాలు రిలీజ్ చేసిన బాలీవుడ్.. ఇప్పుడు సీరియస్‌గా దీనిపై దృష్టిపెడుతోంది. క్రేజీ సినిమాలకు వరుసగా రిలీజ్ డేట్లు ఇస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ‘పృథ్వీరాజ్’ లాంటి భారీ చిత్రంతో పాటు ఒకేసారి ఐదు సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించింది.

అలాగే జాన్వి కపూర్ సినిమా ‘రూహి’కి ట్రైలర్ లాంచ్ చేసి మార్చి 21న రిలీజ్ అని ప్రకటించారు. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రెండు భారీ చిత్రాలకు విడుదల తేదీలు ఖరారయ్యాయి. అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ని ఏప్రిల్ 2కు ఫిక్స్ చేయగా.. కపిల్ దేవ్ జీవిత కథతో తెరకెక్కిన రణ్వీర్ సింగ్ మూవీ ‘83’ని జూన్ 4న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ చిత్రాల రిలీజ్ అనౌన్స్‌మెంట్లు రాబోతున్నాయి. మొత్తానికి త్వరలోనే బాలీవుడ్ మళ్లీ గాడినపడబోతోందని స్పష్టమవుతోంది.