ఉప్పెన లాంటి విభిన్నమైన సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు వైష్ణవ్ తేజ్. అతను చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లకు చిన్న మేనల్లుడు.. సాయిధరమ్ తేజ్‌కు తమ్ముడు అన్న సంగతి తెలిసిందే. మెగా వారసత్వాన్ని నిలబెడుతూ అతను తొలి సినిమాలో అన్ని రకాలుగా మెప్పించాడు. చిన్నతనంలోనే చిరు సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో ఓ కీలక పాత్రతో ఆకట్టుకున్న వైష్ణవ్ ఇప్పుడు హీరోగానూ తొలి సినిమాలో సత్తా చాటాడు.
మైత్రీ లాంటి పెద్ద బేనర్లో అతడి తొలి సినిమా కుదరడంలో మెగా ఫ్యామిలీ బ్యాకప్ లేకుండా ఏమీ లేదు. ముందు నుంచే వైష్ణవ్‌ను హీరోగా తయారు చేయడంలో పవన్ కళ్యాణ్, ఉప్పెన కథను మళ్లీ మళ్లీ విని అంతా ఓకే అనుకున్నాకే వైష్ణవ్ తొలి చిత్రానికి పచ్చ జెండా ఊపడంలో చిరు కీలక పాత్రే పోషించారట. ఈ విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉప్పెన విజయోత్సవ వేడుకలో వెల్లడించడం విశేషం.
వైష్ణవ్ హీరో కావడంలో చిరు, పవన్ అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదని చరణ్ చెప్పాడు. వైష్ణవ్‌ను హీరోగా సిద్ధం చేయడంలో పవన్ పాత్ర కీలకం అన్నాడు. అతణ్ని విదేశాలకు పంపి మరీ పలు రకాలుగా ట్రైనింగ్ ఇప్పించి హీరో కావడానికి సర్వ సన్నద్ధం చేయించింది పవనే అని చరణ్ తెలిపాడు. ఇక చిరు అందించిన ప్రోత్సాహం గురించి వివరిస్తూ ఉప్పెన కథను ఆయన నాలుగు సార్లు విని, అవసరమైన కరెక్షన్లు చెప్పారన్నాడు. అలాగే నిర్మాతలకు కూడా ఆయన ఎంతో అండగా నిలిచారన్నాడు.
తన సినిమాలకు కూడా ఎప్పుడూ లేనంతగా ఉప్పెన కోసం చిరు సమయం కేటాయించినట్లు చరణ్ వెల్లడించాడు. ఆ ఇద్దరి ప్రోత్సాహం ఉండటం వైష్ణవ్ అదృష్టం అని, అలాగే తామందరి కెరీర్ల వెనుక చిరు, పవన్ ఉండటం తాము చేసుకున్న అదృష్టమని చరణ్ ఉద్వేగంగా చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates