నాగార్జునతో వైష్ణవ్ తేజ్?

సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు నిర్మాతగా కూడా మంచి పేరే ఉంది. తాను హీరోగా సినిమాలు నిర్మించడమే కాదు.. అప్పుడప్పుడూ యువ కథానాయకులను పెట్టి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తుంటారు. ‘ఉయ్యాల జంపాల’ ఆ కోవలోని సినిమానే. చివరగా రాజ్ తరుణ్‌నే హీరోగా పెట్టి ‘రంగుల రాట్నం’ అనే సినిమా తీశాడు నాగ్. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు.

దీంతో కొంచెం గ్యాప్ తీసుకున్న నాగ్.. త్వరలోనే ఓ యువ కథానాయకుడితో సినిమా నిర్మించబోతున్నాడట. ఆ హీరో మరెవరో కాదు.. ‘ఉప్పెన’ లాంటి సెన్సేషనల్ మూవీతో హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమా రిలీజైనా కాకముందే వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న వైష్ణవ్‌తో నాగ్ కూడా ఓ సినిమా చేయబోతున్నాడట. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ మీద తెరకెక్కే ఈ చిత్రంతో కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడట.

విశేషం ఏంటంటే.. నాగార్జున కొడుకులు ఇద్దరితో మెగా ఫ్యామిలీకి చెందిన గీతా ఆర్ట్స్ సినిమాలు నిర్మించింది. నాగ్ పెద్ద కొడుకు నాగచైతన్యతో ‘100 పర్సంట్ లవ్’ తీసిన అల్లు అరవింద్.. ప్రస్తుతం నాగ్ చిన్న కొడుకు అఖిల్‌ను పెట్టి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో నాగ్ మెగా ఫ్యామిలీకి చెందిన కొత్త కుర్రాడితో సినిమా ప్రొడ్యూస్ చేయబోతుండటం విశేషమే.

వైష్ణవ్ ‘ఉప్పెన’ను పూర్తి చేసిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ కథానాయికగా ఓ సినిమాను మొదలుపెట్టడం, కొన్ని నెలల్లోనే దాన్ని పూర్తి చేసేయడం తెలిసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత వైష్ణవ్ చేయబోయేది నాగార్జున బేనర్లోని సినిమానే అంటున్నారు. మరోవైపు ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాలతో నిర్మాతలుగా మంచి పేరు సంపాదించిన షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి సైతం వైష్ణవ్ హీరోగా ఓ సినిమాకు కమిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.