ఓవర్సీస్ గేట్లు ఎత్తిన ఉప్పెన

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను ఎంతగా దెబ్బ కొట్టిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో ఏడు నెలల పాటు థియేటర్లు మూత పడి ఉండటంతో వేల కోట్ల నష్టం వాటిల్లింది. అక్టోబరులో థియేటర్లు పున:ప్రారంభం అయినప్పటికీ మూణ్నాలుగు నెలల పాటు సగం ఆక్యుపెన్సీతోనే నడిచాయి. ఈ నెల ఆరంభం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం వచ్చినా.. దేశంలో థియేటర్లు ఒకప్పటి స్థాయిలో నడవడానికి, రెవెన్యూ రావడానికి సమయం పట్టేలా ఉంది.

టాలీవుడ్ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మార్కెట్ బాగానే పుంజుకుంది కానీ.. ఇతర రాష్ట్రాల్లో, అలాగే ఓవర్సీస్‌లో మార్కెట్ ఇంకా బలపడాల్సి ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ కరోనా ధాటికి మామూలుగా దెబ్బ తినలేదు. ఒకప్పుడు మిలియన్ల మీద మిలియన్ డాలర్లు కొల్లగొట్టేసిన మన సినిమాలు ఇప్పుడు అందులో పదో వంతు రాబట్టడానికి కూడా కష్టపడుతున్నాయి. ముఖ్యంగా యుఎస్‌లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడం, అక్కడి ప్రేక్షకులు ఒకప్పట్లా సినిమాల పట్ల ఆసక్తి ప్రదర్శించకపోవడం ఇందుకు కారణం.

కరోనా విరామం తర్వాత టాలీవుడ్‌కు రీస్టార్ట్ సినిమా అయిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ యుఎస్‌లో కేవలం 23 వేల డాలర్లు మాత్రమే రాబట్టింది. సంక్రాంతికి అక్కడ కొద్దిగా మార్కెట్ పుంజుకుంది కానీ.. ఫుల్ రన్ షేర్లు ఏమంత ఆశాజనకంగా కనిపించలేదు. క్రాక్ సినిమా అత్యధికంగా ఫుల్ రన్లో 1.3 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఈ స్థాయి సినిమాకు ఈ మొత్తం ఒక్క రోజులోనే వచ్చేసేది. దీన్ని బట్టి మార్కెట్ ఎంత డల్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

ఐతే ఈ వారాంతంలో విడుదలైన ‘ఉప్పెన’తో యుఎస్ మార్కెట్ మళ్లీ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. ఈ చిత్రానికి రిలీజ్ ముందు రోజు ప్రిమియర్స్ కూడా పడ్డాయి. కరోనా విరామం తర్వాత యుఎస్‌లో అత్యధిక లొకేషన్లలో రిలీజైన సినిమా ఇది. శనివారం నాటికి ఈ చిత్రం 1.2 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఆదివారం కూడా మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్లో 2.5 లక్షల డాలర్ల వరకు ఈ సినిమా రాబట్టే అవకాశముంది. ఇలాగే యుఎస్ ప్రేక్షకులను ఆకర్షించే మరిన్ని సినిమాలు పడితే.. వేసవి సమయానికి అక్కడి మార్కెట్ మరింత బలపడే అవకాశముంది.