సంగీత ద‌ర్శ‌కుడితో కీర్తి పెళ్లి?

మ‌హాన‌టితో న‌టిగా తిరుగులేని స్థాయి అందుకున్న కీర్తి సురేష్‌.. ఆ సినిమా త‌ర్వాతి నుంచి ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తోంది. మీడియా ఫోక‌స్ ఆమెపై బాగా ఎక్కువైంది. త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై శూల‌శోధ‌న‌లు న‌డుస్తున్నాయి. ఆమె ప్రేమ, పెళ్లి వ్య‌వ‌హారాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు పుకార్లు న‌డుస్తూనే ఉన్నాయి.

ఇంత‌కుముందు త‌మిళ క‌మెడియ‌న్ స‌తీశ్‌తో ఆమె పెళ్లి అంటూ ఓ ప్ర‌చారం న‌డిచింది. కెరీర్ ఆరంభంలో కీర్తి స్థాయి త‌క్కువ‌గా ఉన్న‌పుడు స‌తీశ్‌తో స‌న్నిహితంగానే ఉండేది కానీ.. ఆ త‌ర్వాత ఆమె స్థాయికి త‌న‌తో పెళ్లేంటి అనే చ‌ర్చ న‌డిచింది. ఈ ప్ర‌చారం త్వ‌ర‌గానే ముగిసిపోయింది. ఆ త‌ర్వాత త‌ల్లిదండ్ర‌లు చూసిన‌ ఓ వ్యాపార‌వేత్త‌ను కీర్తి పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు గ‌త ఏడాది జోరుగా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఆ ప్ర‌చారాన్ని కీర్తి ఖండించింది కూడా. త‌ర్వాత కొంత స్త‌బ్ద‌త న‌డిచింది.

ఐతే ఇప్పుడు మ‌ళ్లీ కీర్తి పెళ్లి గురించి కొత్త‌గా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌ను పెళ్లాడ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో వీరి క్లోజ్ ఫొటోలు పెట్టి ఇద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లాడబోతున్న‌ట్లు పోస్టులు పెడుతున్నారు నెటిజ‌న్లు. ఈ ఫొటోల్లో కొత్త‌ద‌నం ఏమీ లేదు. అవి ఇంత‌క‌ముందు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన‌వే. వీళ్లిద్ద‌రూ ముందు నుంచి మంచి స్నేహితులే. స‌ర‌దాగా క‌లిసిన‌పుడు దిగిన ఫొటోలే అవి. వాటినే పెట్టి ఇద్ద‌రూ ప్రేమ‌లో మునిగి తేలుతున్నార‌ని, పెళ్లికి రెడీ అయిపోతున్నార‌ని ఊహాగానాలు సాగిస్తున్నారు.

ఐతే ఇది రూమ‌ర్ రాయుళ్లు పుట్టించిన వార్తేనా.. ఏమైనా నిజం ఉందా అన్న‌ది తెలియ‌డం లేదు. త‌మిళ మీడియాలోనూ సంబంధిత వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌టంతో ఇందులో ఏమైనా వాస్తవం ఉందా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. మ‌రి కీర్తి కానీ, అనిరుధ్ కానీ ఈ వార్త‌పై ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.